కల్తీ కారం కలవరం..

13:15 - December 25, 2016

ఖమ్మం : ముందు దగా.. వెనక దగా.. కుడి ఎడమల దగా దగా.. అన్న చందంగా...ముందు కల్తీ వెనక కల్తీ.. ఎక్కడ చూసినా కల్తీ కల్తీ.. అని చెప్పుకోవాల్సి వస్తోంది. గాలి, నీరు, తినే తిండితో పాటు ప్రతిఒక్కటీ కల్తీమయం అయిపోయింది. తాజాగా ఖమ్మంలో మరో కల్తీ కారం మాఫియా గుట్టు రట్టయింది. అయితే.. ఈ మాఫియా వెనుక ఎందరో విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పాల్సిన ఓ ఉపాధ్యాయుడే సూత్రధారుడుగా ఉండటం కలకలం సష్టిస్తోంది. ఖమ్మం జిల్లా కల్తీ కారం మాఫియాపై 10 టివి స్పెషల్‌ స్టోరీ...! 
కల్తీ కారం మాఫియా 
ఖమ్మం జిల్లాలో కల్తీ కారం మాఫియా ప్రజల ఆరోగ్యాలను గుల్ల చేస్తోంది. మధిర, ముదిగొండ, ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌లోని శ్రీనివాస్‌నగర్‌, ఖమ్మం అర్బన్‌ మండలం అల్లీపురంలో టన్నులకొద్దీ నకిలీ కారం బస్తాలు ప్రత్యక్షం కావడం ప్రజల్ని ఆందోళనకు గురిచేస్తోంది. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న ఈ కల్తీ కారం మాఫియా ఆగడాలు పెచ్చుమీరి పోతున్నా... వారిపై చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 
అక్రమార్కులకు కొమ్ముకాస్తున్న అధికార పార్టీ నేత...? 
భారీ ఎత్తున కల్తీ కారం బస్తాలు బయటపడ్డ వ్యవహారంలో.. అధికార పార్టీకి చెందిన ఓ నేత చక్రం తిప్పుతూ అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాలకు.. మధిర ప్రాంతం నుంచే కల్తీకారం సరఫరా అవుతున్నా... సంబంధిత నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోకవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 
తూతూ మంత్రంగా పోలీసులు చర్యలు 
బస్తాల కొద్దీ కల్తీ కారం బయటపడ్డా... కల్తీ మాఫియాపై పోలీసులు తూతూ మంత్రంగా కేసులు పెట్టి వదిలిపెట్టడంతో... నిందితులు మళ్లీ యథేచ్చగా అక్రమ కల్తీ వ్యాపారం చేస్తుండటం గమనార్హం. కల్తీ కారం బస్తాలను తరలిస్తున్న 11 లారీలను ఇటీవల మధిరలో పట్టుకున్నారు. వాటిలో 3 లారీల కారాన్ని మధిర ప్రాంతం వైరా నది వద్ద, 2 లారీల సరకును దెందుకూరు సమీపంలో పడేశారు. ఇంకా 6 లారీల నకిలీ కారం సరకు ఎటుపోయిందన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. 
సూత్రదారి.. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యయుడు 
ఈ కల్తీ కారం మాఫియా సూత్రదారుడు... మధిర మండలం జిలుగుమాడు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడన్న విషయం తెలిసి స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. పిల్లలకు విద్యాబద్ధులు నేర్పాల్సిన ఓ ఉపాధ్యాయుడే ఈ మాఫియాను నడుపుతూ ప్రజారోగ్యం క్షీణించే పనికి ఒడిగట్టడం ఏంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో సదరు ఉపాధ్యాయుడు చైనాకు చెందిన వాంగ్‌ బయోటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ నుంచి.. కారం తయారు చేసిన తర్వాత వచ్చే వ్యర్థ పదార్థాలను  కొనుగోలు చేసేవాడు. వాటితో నకిలీ కల్తీ కారం తయారు చేసి మార్కెట్‌లో విక్రయించేవాడు. ఈ క్రమంలో తెలంగాణ, ఏపీలోని పలు ప్రాంతాల్లోనూ వ్యాపారాలు కొనసాగిస్తున్నాడు. 
అసలు సూత్రధారిని వదిలేశారు... 
కల్తీ కారం తాయారీకి సంబంధించిన వ్యర్థ పదార్థాలను బస్తాల్లో నింపి..  ఖమ్మం , మధిర, వైరా, కొణిజర్ల, ముదిగొండ , విజయవాడ, గుంటూరు జిల్లాలోని కోల్డ్ స్టోరేజీలో భద్రపరిచారు. మధిరలో విషయం బయటకు పొక్కడంతో.. అధికార పార్టీకి చెందిన ఓ నేత అపుడే పైరవీ ప్రారంభించినట్లు సమాచారం. అసలు సూత్రధారిని వదిలి కేవలం నకిలీ కారం బస్తాలను కోల్డ్ స్టోరేజీలో దాచిన వారిపైనే విజిలెన్స్, పోలీసులు ఒత్తిడి చేస్తున్నారన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి.  
నిందితులను కఠినంగా శిక్షించాలి : స్థానికులు 
మధిర పరిధిలో ఐదు లారీల నకిలీ కారం బస్తాలు, ఖమ్మం నగరంలోని శ్రీనివాసనగర్‌లో 25 క్వింటాళ్ల నకిలీ కారం సీజ్‌ చేయడం, ఖమ్మం అర్బన్ మండలం అల్లీపురం సాగర్ కాలువ సమీపంలో 2 వేల బస్తాలు పడేసి వెళ్లడం.. వీటితో పాటు....కొణిజర్ల మండలం పల్లిపాడు సమీపంలోని ఓ కోల్డ్‌ స్టోరేజీలో లక్షా 39 వేలకు పైగా మిరప విత్తనాల బస్తాలు వెలుగు చూడటం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే దీనికి సంబంధించి విచారణ కొనసాగుతోందని అధికారుల చెబుతున్నారు. ఈ కల్తీ కారం వ్యవహరానికి సబంధించి నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.  

 

Don't Miss