విలీన మండలాలకు వరద ముప్పు

07:42 - July 12, 2018

తూర్పుగోదావరి : వానాకాలం వస్తే.. తూర్పుగోదావరి జిల్లా విలీన మండలాల ప్రజలకు ప్రాణగండమే.. ఎగువ ప్రాంతాల్లో కురుసే వర్షాలకు గోదావరి నీటి మట్టం పెరిగితే  చాలు ఈ ప్రాంత ప్రజానీకం గుండెల్లో దడ పుడుతుంది. ఏజెన్సీలోని కొన్ని గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయి. రోగులు, గర్భవతులకు మరణ యాతనే.. భారీ వర్షాలు కురిశాయంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే.. తూర్పు పోలవరం ముంపు మండలాలకు పొంచి ఉన్న వరద ముప్పుపై టెన్‌టీవీ ప్రత్యేక కథనం...
భయంతో వణుకుతున్న విలీన మండలాల ప్రజల 
చినుకు పడితే చాలు.. తూర్పుగోదావరి జిల్లా విలీన మండలాల ప్రజల గుండెల్లో పిడుగులు పడ్డంతగా భయపడతారు.  వాగులు, వంకలు పొంగాయంటే.. వారికి ప్రాణ గండమే. గోదావరి నీటి మట్టం పెరిగితే.. ఏజెన్సీలోని కొన్ని గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోతాయి. ఎవరైనా అనారోగ్యం బారిన పడితే.. వారి బతుకులు గాల్లో దీపంతో సమానం. 
ఉధృతంగా ప్రవహిస్తున్న సోకులేరు వాగు
ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లా ఎగువప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు చింతూరు మండలంలోని సోకులేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో అవతలి ఒడ్డున ఉన్న గవన్లకోట, చదలవాడ, చౌలూరు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ఇక్కడి ప్రజలు ఏచిన్న పనికోసమైనా ఈ సోకులేరు వాగు దాటాల్సిందే. నడుంలోతు నీళ్ళలో దిగి  వస్తువులను నెత్తిన పెట్టుకుని వాగు దాటడమంటే.. ప్రాణాలతో చెలగాటమే.  ఇప్పటివరకూ ఈ మూడు గ్రామాలకు చెందిన వారు సుమారు 24 మంది ఈ వాగు దాటుతూ.. చనిపోయారని స్థానిక ఎంపీపీ చిచ్చడి మురళి అన్నారు. 
తెలంగాణ, ఏపీ రాకపోకలకు అంతరాయం
వరదలు ముంచెత్తితే.. ప్రజలు సురక్షితంగా ఉండేందుకు కోతులగుట్టలోని రెడ్‌క్రాస్‌ బిల్డింగ్‌లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. భద్రాచలం వద్ద వరద ఉధృతి పెరిగే కొద్దీ.. గోదావరి, శభరి నదుల పరివాహక ప్రాంతంలో ఉన్న కూనవరం, విఆర్‌పురం మండలాలకు వరద తాకిడి ఎక్కువగా ఉంటుంది.  గోదావరి, శభరి నదుల వద్ద పది అడుగుల నీటి మట్టం పెరిగితే తెలంగాణ- ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాలకు రాకపోకలు నిలిచిపోతాయి.  చాలా గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకుంటాయి. వర్షాకాలం వస్తే ఈప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిందే.  ఇప్పటికైన ప్రభుత్వం స్పందించి బ్రిడ్జీ, రోడ్ల సౌకర్యం కల్పించాలని ఈ ప్రాంత ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. 

 

Don't Miss