డ్రగ్స్ రాకెట్లో పెద్దోళ్లు!!..

19:38 - October 5, 2016

ఢిల్లీ : ఓ సైంటిస్టు సృష్టించిన సంచలనం ఇది...మాదక ద్రవ్యాల్లో సరికొత్త దనాన్ని చూపిస్తూ స్నేహితుల సహకారంతో పాటు తెలిసినవారి ద్వారా దొరికిన లింకులతో దేశ,విదేశాలకు డ్రగ్స్ తరలిస్తున్నారు...వందల కోట్లలో బిజినెస్ చేస్తున్న ఈ మాఫియాకు వెన్నుదన్నుగా ఉన్న ఎయిర్‌ఫోర్స్‌ వింగ్‌ కమాండర్‌ దొరికిపోయాడు..ఇంకా ఇందులో ఎంతో మంది పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది...ఎన్‌సీబీ తీగలాగిన కొద్దీ బయటపడుతున్నాయి...

డ్రగ్స్‌ రాకెట్‌లో బయటపడుతున్న పెద్దోళ్లు..
భారీ ఎత్తున స్మగ్లింగ్ చేస్తున్న మాదకద్రవ్యాల కేసులో లోతుగా శోధిస్తున్న నార్కోటిక్స్‌ బ్యూరో అధికారులు మరోకరిని అరెస్టు చేయడం కలకలం రేపింది...ముఠాకు సహకరించిన ఎయిర్‌ఫోర్స్‌ అధికారి రాజశేఖర్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు...భారత వైమానిక దళంలో వింగ్ కమాండర్‌గా పనిచేస్తున్న జి.రాజశేఖరరెడ్డి నాలుగు రోజుల క్రితం అరెస్ట్ అయిన శాస్త్రవేత్త వెంకటరామారావుకు స్నేహితుడే...రాజ‌శేఖ‌ర్ నుంచి రూ.10లక్షల నగదు, ఐదు సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. రాజశేఖర్‌ను ప్రాధమికంగా విచారించిన నార్కోటిక్‌ బ్యూరో అధికారులు అతన్ని అరెస్ట్‌ చేసి రంగారెడ్డి జిల్లా కోర్టులో హాజరు పరిచారు...న్యాయస్థానం రాజశేఖర్‌కు ఈ నెల 18 వరకు రిమాండ్ విధించడంతో వెంటనే జైలుకు తరలించారు....హైదరాబాద్‌, బెంగ‌ళూరులో ముఠా సభ్యుల్లో ముగ్గురిని అరెస్ట్‌ చేసిన నార్కోటిక్‌ అధికారులు తాజాగా వింగ్‌ కమాండర్‌ అరెస్టు తో మొత్తం నలుగురయ్యారు...

వదిలేది కాదంటున్న ఆఫీసర్లు..
ఇదిలా ఉంటే డ్రగ్స్‌ ముఠాకు సూత్రధారి వెంకటరామారావు కాగా...అతనికిక పూర్తి సహకారం అందించిన అతని భార్య ప్రీతితో పాటు మరోకరు శంకర్‌రావులను అరెస్టు చేశారు...గత నెల 29న వీరిని అదుపులోకి తీసుకుని పూర్తిగా విచారించగా భారీగా డ్రగ్స్ బయటపడింది.. ఆ తర్వాత వీరిని విచారించిన అధికారులకు తెలిసిన పేర్లతో పాటు ఎయిర్‌ఫోర్స్‌ వింగ్ కమాండర్ రాజశేఖర్‌రెడ్డి పాత్ర కూడా ఉన్నట్లు తేలింది..దీంతో ఎలాంటి ఆలస్యం చేయకుండా ఆయనపై నిఘా పెట్టిన అధికారులు ఫోన్‌కాల్స్‌ రికార్డులను సేకరించారు..దీంతో రాజశేఖర్‌రెడ్డి కూడా డ్రగ్స్‌ ముఠాలో కీలకమని తేలింది...

స్నేహితుడితో కలిసి దందాలో రాజశేఖర్...
డ్రగ్స్‌ కింగ్‌గా మారిన సైంటిస్టు వెంకటరామారావుకు రాజశేఖర్‌రెడ్డి స్నేహితుడే..దీన్ని ఆసరాగా చేసుకుని రాజశేఖర్‌కు కూడా ఇందులో భాగస్వామ్యం కల్పించినట్లు తెలుస్తోంది... హైదరాబాద్‌ నుంచి డ్రగ్స్‌ను సులువుగా విమానంలోనే బెంగళూరుకు తరలించేవారు...ఇందుకు రాజశేఖర్‌రెడ్డి కూడా పూర్తి సహకారం అందించాడు..ఇందుకు గాను భారీ ఎత్తున డబ్బు ముట్టజెప్పేవారు...

సైంటిస్టు దొరకడంతో తప్పించుకునేయత్నం..
బెంగళూరు, హైదరాబాద్ ప్రధాన కేంద్రాలుగా సాగుతున్న ఈ డ్రగ్ రాకెట్ గురించి ఎన్‌సీబీ వర్గాలు వివరాలు సేకరించి, రాజశేఖరరెడ్డిని అరెస్టు చేసే సమయానికి అతడు గోవా పారిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది...దీంతో వెంటనే అదుపులోకి తీసుకున్నారు...ఇక మలేషియా, థాయ్‌లాండ్, ఇండోనేసియాలతో పాటు కొన్ని పాశ్చాత్య దేశాలకు కూడా యాంఫెటమైన్ స్మగ్లింగ్ చేయడంలో రాజశేఖరరెడ్డిది కీలకపాత్ర అని తెలుస్తోంది...చాలాకాలం పాటు బెంగళూరులో పనిచేసిన అతడికి.. ఆ తర్వాత వైమానిక దళం ప్రధాన కార్యాలయంలో పోస్టింగ్ వచ్చింది. ఈ కేసులో మరికొందరు వైమానిక దళం మాజీ అధికారులు కూడా ఉండే అవకాశం ఉందని, వాళ్లందరి పేర్లు త్వరలోనే బయటకు వస్తాయని అంటున్నారు...
మాదక ద్రవ్యాలను తయారీకి నగరాలే ఎంపిక
మాదక ద్రవ్యాలను తయారు చేయడం కోసం మహానగరంలోని పారిశ్రామిక కంపెనీలను ఎంచుకుంటున్నారు స్మగ్లర్లు..ఎలాంటి అనుమానం రాకుండా పలు కంపెనీల్లో వీటిని తయారు చేసి అక్కడి నుంచి రహస్యంగా తరలిస్తున్నారు..ఇందులో ప్రధానంగా రసాయన పరిశ్రమలను ఎంచుకోవడం వల్ల ఎలాంటి అనుమానాలు రావడం లేదు...భారీగా పట్టుబడ్డ కేసులో దర్యాప్తు చేస్తున్న అధికారులకు మరికొంత మంది పాత్ర ఉన్నట్లు ఇప్పటికే సమాచారం.. ఈ ముఠాలో ఇంకా ఎవరెవరు బయటపడతారో చూడాలి...

రోజుకో మలుపు తిరుగుతున్న డ్రగ్స్ కేసు...
గడిచిన ఐదు రోజులుగా నిర్విరామంగా కొనసాగుతున్న డ్రగ్స్‌ కేసు దర్యాప్తులో ఎన్‌సీబీ అధికారులకు కొత్త కొత్త పేర్లు వినిపిస్తున్నాయి.. ఇప్పటికే బెంగళూరులోని ఓ కంపెనీలో సైంటిస్టుగా పనిచేస్తున్న రామారావుతో పాటు ఆయన భార్య దొరకగా...వారి ద్వారా వింగ్ కమాండర్ రాజశేఖర్ రెడ్డి పట్టుబడ్డారు..అయితే మాదక ద్రవ్యాల రవాణాలో ఓ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన సిబ్బంది ప్రమేయం ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి..దీనికి సంబంధించిన వివరాలు సేకరించిన ఎన్‌సీబీ అనుమానితులను విచారిస్తున్నట్లు తెలుస్తోంది..

విదేశాలకు వెళ్లడానికి ఎన్నో లింకులు..
హైదరాబాద్‌, బెంగళూరులలో కలిపి మొత్తం రూ.45 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లో ముడి పదార్థం తయారు చేసి బెంగళూరుకు ఎగుమతి చేస్తున్నారు..అక్కడ దాన్ని మరింత శుద్ధిచేసి వాడటానికి వీలుగా మాత్రల మాదిరిగా రూపొందించి విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు ఎన్‌.సి.బి. దర్యాప్తులో వెల్లడైంది. తయారీదారులెవరో తేలిపోయింది. విదేశాలకు ఎగుమతి చేసేటప్పుడు ఎవరెవరు సహకరిస్తున్నారన్న దానిపైనే ఇప్పుడు అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు...

Don't Miss