సాహిత్య సృజన శీలి ఆస్ట్రియాస్...

13:58 - January 29, 2017

సాహిత్యం సమాజానికి దిశానిర్దేశం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అనేకమంది కవులు రచయితలు సామాజిక ప్రయోజనం ఆశించి సాహిత్య సృజన చేస్తున్నారు. అలాంటివారిలో గాటిమాలా రచయిత ఆస్ట్రియాస్ ఒకరు. నియంతల అసలు నైజాన్ని, భూమిపుత్రుల సంస్కృతిని, కష్టాలను నవలలుగా చిత్రించిన ఆస్ట్రియాస్ ప్రత్యేక కథనంతో పాటు బూర్గుల ప్రభాకర్ జనం పాట, వివిధ సాహితీ వేదికల వేడుకల సమాహారంగా ఈ వారం మీ ముందుకొచ్చింది 10 టి.వి.అక్షరం.

నరహంతలు ధరాధిపతులైన వేళ , సమస్త ప్రపంచం వారి పాదాక్రాంతమైన వేళ ఒంటరి నిస్సహాయ రచయితలు కొందరు ఏటికి ఎదురీది తమ కలం బలంతో ఆ నియంతల్ని ఢీకొట్టారు. తమ సృజనాత్మక శక్తినే సైన్యంగా మలిచి తిరుగుబాటు ప్రకటించారు. అణచివేతలకు, క్రూరశిక్షలకు సిద్దపడి తమ గుండె ధైర్యాన్ని చాటారు. లాటిన్ అమెరికన్ దేశాలకు చెందిన అలాంటి రచయిత మిగ్యుల్ ఏంజెల్ ఆస్ట్రియాస్ ని పరిచయం చేస్తున్నారు..ప్రముఖ కథకులు టైటానిక్ సురేష్.

ప్రపంచ సాహిత్యంలో నియంతల గురించీ, వారి ఆవిర్భావం, ఎదుగుదల, అణచివేత, నిరంకుశ ప్రవృత్తి, వారి ఉత్థాన పతనాల  ప్రస్ఠానాన్ని చిత్రిస్తూ ప్రతిభావంతమైన నవలలు కొన్ని వచ్చాయి. పాశ్చాత్య సాహిత్యంలో ఆ రచనా ధోరణిని  'డిక్టేటర్ నావెల్' అని పిలుస్తారు.  అలాంటి 'డిక్టేటర్ నావెల్' రచనా ధోరణికి  లాటిన్ అమెరికన్ సాహిత్యంలో అద్యుడు  మిగ్యుల్ ఏంజెల్ ఆస్ట్రియాస్.  

అది కలా నిజమా? పౌరాణికమా, చారిత్రకమా? వచనమా, కవిత్వమా? గతమా, వర్తమానమా? కల్పనా, వాస్తవమా? జానపదమా, సర్రియలిజమా? మౌఖిక కథనమా, ఏదీకాని దిగంతాల స్వప్న సంభాషణా? ఇవన్నీ కల గలిసిన ఓ సరికొత్త శైలిలో లాటిన్ అమెరికన్ సాహిత్యంలోనే అత్యంత క్లిష్టమయిన ఆధునిక మహా కావ్య రచనకు పూనుకొన్నాడు  మిగ్యుల్  ఏంజెల్ ఆస్ట్రియాస్. అదే  మెన్ ఆఫ్ మైజ్ నవల ....    

 

Don't Miss