సుప్రసిద్ధ రచయిత అశోక్ మిత్రన్

13:28 - March 26, 2017

ఆధునిక తమిళ కథా, నవలా సాహిత్యంలో విశేష కృషిచేసిన సుప్రసిధ్ధ రచయిత అశోక్ మిత్రన్. జీవిత వాస్తవికతకు అద్దం పట్టే కథలు, నవలలను రాసిన అశోక మిత్రన్ అసలు పేరు జగదీశ త్యాగరాజన్. ఆయన 1931 సెప్టెంబర్ 22న సికింద్రాబాద్ లో జన్మించారు. 20 ఏళ్లు సికింద్రాబాద్ లోనే చదువుకున్నారు. తర్వాత 1952 లో మద్రాస్ వెళ్ళిపోయారు. అక్కడ జెమిని స్టూడియోలో దశాబ్దం పైగా పని చేశారు.
200 కథలు, 8నవలలు
అశోక్ మిత్రన్ 200 కథలు, 8నవలలు. ఆయన కథల్లో సినీ జీవుల వ్యథలు, సామాన్య ప్రజల జీవన చిత్రాలు, జీవితానుభవాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి.1953 లో ఆయన రాసిన అన్ బిన్ పరిసు నవల అప్పట్లో సంచలనం సృష్టించింది. తన్నీర్, మానస సరోవర్, పావమ్ దళ్ పతడో మెుదలైన నవలలు అశోకమిత్రన్ కు ఎంతో కీర్తిని తెచ్చి పెట్టాయి. ఆయన రాసిన తన్నీర్ నవలను దర్శకుడు వసంత్ సినిమాగా తీశాడు.
తమిళ సాహిత్యంలో గుర్తింపు 
మిత్రన్ వ్యాసరచయితగా, విమర్శకునిగా తమిళ సాహిత్యంలో గుర్తింపు పొందారు. 1966 లో ఆయన రాసిన మై ఇయర్స్ విత్ బాస్  కాలమ్స్ మిత్రన్ కు మంచిగుర్తింపునిచ్చాయి. ఆయన కథలు, నవలలు ఇంగ్లీషుతో పాటు పలు యూరోపియన్ భాషల్లోకి అనువాదమయ్యాయి.
అవార్డులు, రివార్డులలతో సత్కారం...
అశోక్ మిత్రన్ సాహితీ కృషికి ఎన్నో సంస్థలు అవార్డులు రివార్డులిచ్చి సత్కరించాయి. 1995లో అశోక్ మిత్రన్ వెలువరించిన అప్పవిన్ స్నేగిధర్ కథల సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.  యూనివర్సిటీ ఆఫ్ అయోవా నుంచి క్రియేటివ్ రైటింగ్ ఫిలోషిప్, యం.ఆర్ .జి అవార్డు, లిలీ మెమోరియల్ అవార్డు, అక్షర తదితర అవార్డులెన్నో అందుకున్నారు. సాధారణ కుటుంబంనుంచి, గొప్ప రచయితగా ఎదిగి ఇటీవల కన్ను మూసిన అశోక్ మిత్రన్ కు 10 టి.వి.అక్షరం నివాళులర్పిస్తోంది.

 

Don't Miss