పార్లమెంట్..విపక్షాల అస్త్రశస్త్రాలు..

19:34 - July 16, 2017

ఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నిక, పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరిగింది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్ నేతృత్వంలో జరిగిన ఆల్ పార్టీ మీటింగ్‌కు టీఎంసీ మినహా అన్ని పార్టీల అగ్ర నేతలు హజరయ్యారు. సమావేశాలు సజావుగా జరిగేలా సహకరించాలని అఖిలపక్ష నేతలకు కేంద్రం విజ్ఞప్తి చేసింది. మరోవైపు సమావేశాల్లో ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, ప్రజా సమస్యలపై నిలదీసేందుకు ప్రతిపక్షాలు సిద్ధం అవుతున్నాయి.

మహిళా రిజర్వేషన్..
దేశంలో ఇంటర్నల్ సెక్యూరిటీ, వ్యాపారంలో పరిస్థితి దిగజారాయని.. వీటిపై పార్లమెంటులో చర్చించాల్సిన అవసరం ఉందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లును ప్రవేశపెడతామని చెప్పిన బీజేపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లైనా ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదని ఏచూరి అన్నారు.

పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరిగేనా ?
జీఎస్టీలోని లోపాల్ని సరిచేసి ప్రజల్లో ఉన్న ఆందోళన పోగొట్టే విధంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరినట్లు కేంద్రమంత్రి సుజనా చౌదరి చెప్పారు. అదే విధంగా చైనా బోర్డర్ టెన్షన్, అమర్ నాథ్ యాత్రికులపై జరిగిన ఉగ్రదాడి అంశాలపై ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరినట్లు సుజనా చెప్పారు.

ఫిరాయించిన నేతలపై చర్యలేవి - మేకపాటి..
దేశ వ్యాప్తంగా వ్యవసాయదారులు పడుతున్న ఇబ్బందుల్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లామన్నారు వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి. పార్టీ ఫిరాయింపుల నిరోదక చట్టంలో సవరణలు తేవడంతో పాటు.. పార్టీ ఫిరాయించిన వారిపై మూడు నెలల్లోగా చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీని కోరినట్లు మేకపాటి తెలిపారు.

జీఎస్టీ గ్రానైట్ పరిశ్రమ
జీఎస్టీ నుంచి గ్రానైట్ పరిశ్రమకు మినహాయింపు ఇవ్వాల్సిందిగా కేంద్రాన్ని కోరినట్లు టీఆర్‌ఎస్‌ ఎంపి జితేందర్ రెడ్డి చెప్పారు. ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్ స్కీం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పనులకు సంబంధించిన అంశాల్లో జీఎస్టీ మినహాయింపు కోరినట్లు జితేందర్ రెడ్డి చెప్పారు.
సోమవారం రాష్ట్రపతి ఎన్నికతో పాటు.. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అధికార పక్షాన్ని నిలదీసేందుకు విపక్షాలు అస్త్ర శస్త్రాలను సమకూర్చుకుంటున్నాయి.

Don't Miss