తెలుగు రాష్ట్రాల్లో 'హార్తాళ్' కు సిద్ధం..

13:18 - November 27, 2016

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని నిరసిస్తూ రాజకీయ పార్టీలు, కార్మిక, కర్షక, ప్రజా సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం జరిగే భారత్‌ బంద్‌కు తెలుగు రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయి. బంద్‌ సందర్భంగా ధర్నాలు, రాస్తా రోకోలు, రైల్‌ రోకోలు చేయాలని నిర్ణయించాయి. హర్తాళ్‌ను విజయవంతం చేసేందుకు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తూ ప్రజలు, నేతలు, కార్యకర్తలను సన్నద్ధం చేస్తున్నాయి. ఐదొందలు, వెయ్యి రూపాయల నోట్లు రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వ ఈనెల 8న తీసుకున్న నిర్ణయం అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నల్లధనం వెలికితీత పేరుతో పెద్ద నోట్ల రద్దు చేసిన ప్రధాని మోదీ నిర్ణయాన్ని అందరూ సమర్థిస్తున్నారు. కానీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ఉన్నపళంగా కరెన్సీని రద్దు చేయడాన్ని నిరసిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆకస్మిక నిర్ణయంతో సమాన్యులు, రైతులు, కూలీలు, కార్మికులు తీవ్ర ఇబ్బందు ఎదుర్కొంటున్నారు. ఈ వర్గాల సమస్యల పరిష్కారంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ రాజకీయ పార్టీలు, కార్మిక, ప్రజా సంఘాలు సోమవారం భారత్‌ బంద్‌కు పిలుపు ఇచ్చాయి.

తెలుగు రాష్ట్రాలు సిద్ధం..
తెలుగు రాష్ట్రాలు ఇందుకు సర్వం సిద్ధమయ్యాయి. తెలంగాణలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో నల్లజెండాలతో నిరసన వ్యక్తం చేస్తూ, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేయాలని తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ నిర్ణయిచింది. పెద్ద నోట్ల రద్దకు నిరసనగా ప్రభుత్వ కార్యక్రమాలన్నింటినీ స్తంభింపచేయాలని ఏపీ పీపీసీ నిర్ణయించింది. నోట్ల రద్దు తీరుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఈ నెల 28 న జరిగే హార్తాల్ కు తమ పార్టీ మద్దతిస్తోందని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా వామపక్షాలు, ప్రాంతీయ పార్టీలు చేస్తున్న నిరసనలకు వైసీపీ పూర్తి మద్దతు తెలుపుతోందని అన్నారు. ఐదొందలు, వెయ్యి రూపాయల నోట్లు రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న అనాలోచిత నిర్ణయానికి నిరసనగా సోమవారం జరిగే బంద్‌కు.. ఏపీలో సీపీఎం శ్రేణులు సిద్ధమయ్యాయి. కాపు రిజర్వేషన్‌ పోరాట సమితి నేత ముద్రగడ పద్మనాభం కూడా భారత్‌ బంద్‌కు మద్దతు ప్రకటించారు. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు పడుతున్న కష్టాలకు సంఘీభావంగా ప్రజా ప్రతినిధులందరూ బ్యాంకుల దగ్గర క్యూలో నిలబడాలని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ట్వీట్‌ చేశారు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంట నగరాల ఆటో కార్మిక సంఘాల సమాఖ్య భారత్‌ బంద్‌కు మద్దతు ప్రకటించింది. మొత్తం మీద పెద్ద నోట్ల రద్దుకు నిరసనగా రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున సిద్ధమతున్నాయి. 

Don't Miss