అమెరికాను వణికిస్తున్న ఇర్మా

20:26 - September 8, 2017

వాషింగ్టన్ : కరేబియన్‌ దీవుల్లో ఇర్మా తుఫాను పెను బీభత్సం సృష్టించింది. అట్లాంటిక్‌ మహాసముద్రంలో ఏర్పడ్డ హరికేన్లలో కెల్లా అత్యంత శక్తిమంతమైన ఈ తుపాను గత రెండు రోజులుగా కరేబియన్‌ దీవులను అతలాకుతలం చేసింది. కరేబియన్‌ దీవుల్లో విధ్వంసం సృష్టించిన ఇర్మా- క్రమంగా అమెరికాలోని ఫ్లోరిడా తీరం వైపు దూసుకెళ్తోంది. డొమినికన్‌ రిపబ్లిక్, హైతీలపై ప్రభావం చూపిన హరికేన్‌...క్యూబా, బహమాస్‌ మీదుగా ఆదివారం తెల్లవారుజామున ఫ్లోరిడా తీరాన్ని తాకవచ్చని అమెరికా వాతావరణ శాఖ పేర్కొంది. ఆంటిగ్వా, బార్బుడా, సెయింట్‌ మార్టిన్‌, సెయింట్‌ బార్టెలెమి, వర్జిన్‌ ఐలాండ్స్, ప్యూర్టోరికా దీవుల్లో ఇర్మా కోలుకోలేని దెబ్బ తీసింది. గంటకు 285 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండడంతో విద్యుత్‌, సమాచార, రవాణా వ్యవస్థలు కుప్ప కూలాయి.

ఇప్పటివరకు 14 మంది చనిపోయారు
హరికేన్‌ ఇర్మా ధాటికి కరేబియన్‌ దీవుల్లో ఇప్పటివరకు 14 మంది చనిపోయారు. సెయింట్‌ మార్టిన్‌ ద్వీపంలో 95 శాతం ఇళ్లు ధ్వంసమయ్యాయి. ప్యూర్టోరికాలో 10 లక్షల మంది ప్రజలు చీకట్లో మగ్గుతున్నారు. 50 వేల మందికి తాగునీటి సరఫరా నిలిచిపోయింది. బార్బుడా దీవుల్లో దాదాపు 60 శాతం మంది నిరాశ్రయులయ్యారు.ఇర్మా అట్లాంటిక్‌ తీర ప్రాంతాన్ని ప్రభావితం చేయనుందని అమెరికా వాతావరణ శాఖ వెల్లడించింది. ఇర్మా ధాటికి ఫ్లోరిడా తీర ప్రాంతంలో తీవ్ర నష్టం వాటిల్లవచ్చని, ఫ్లోరిడాతో పాటు జార్జియా, దక్షిణ కరోలినా రాష్ట్రాల్లో భారీ విధ్వంసం జరగవచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది. ఫ్లోరిడాలో ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. అధికారులు స్థానికులను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అమెరికా చరిత్రలోనే అత్యంత నష్టాన్ని మిగిల్చే తుపానుగా మిగిలిపోవచ్చని యూనివర్సిటీ ఆఫ్‌ మియామికి చెందిన హరికేన్‌ పరిశోధకుడు బ్రియాన్‌ మెక్‌ నోల్డీ చెప్పారు. 

Don't Miss