అమ్మఒడి పథకం ప్రారంభానికి సర్వం సిద్ధం

06:56 - May 27, 2017

హైదరాబాద్: ప్రభుత్వ ఆస్పత్రల్లో ప్రసవాలను ప్రోత్సహిచేందుకు ఉద్దేశించిన అమ్మ ఒడి పథకం అమలును తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. వచ్చే నెల 3న హైదరాబాద్‌లోని పేట్ల బురుజు ఆస్పత్రిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

తెలంగాణలో తొమ్మిది బోధనాస్పత్రులు

అమ్మ ఒడి కార్యక్రమం అమలుకు వీలుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యలు మెరుగుపరుస్తారు. తెలంగాణలోని 9 బోధనాస్పత్రులు, ఆరు జిల్లా వైద్యశాలలు, మాతా, శిశు సంరక్షణ కేంద్రాలు, ముప్పై ఏరియా ఆస్పత్రుల్లో ఈ పథకం అమలు చేస్తారు. అలాగే 114 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 24 గంటలకు పనిచేసే 314 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 365 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కేసీఆర్‌ కిట్ల పంపిణీకి ఎంపిక చేశారు. రాష్ట్రంలో ఏటా 6,28,319 ప్రసవాలు జరుగుతున్నాయి. వీటిలో యాభై శాతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరిగే విధంగా చూస్తారు. ప్రస్తుతం 30 నుంచి 40 శాతం ప్రసవాలు మాత్రమే సర్కారు దవాఖానల్లో జరుగుతున్నారు. అమ్మ ఒడి పథకం ప్రారంభించిన తర్వాత ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

గర్భిణిలకు మూడు విడతలుగా రూ.12 వేల ఆర్థిక సాయం.....

అమ్మ ఒడి పథకం కింద కేసీఆర్‌ కిట్లు అందించేందుకు ఇంతవరకు మూడు లక్షల మంది గర్భిణిలను నమోదు చేశారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. వీరికి మూడు విడతలుగా 12 వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తారు. ఆడిపిల్ల పుడితే మరో వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తారు. ప్రసవం తర్వాత రెండు వేల రూపాయల విలువచేసే 16 రకాల వస్తువులు ఉండే కేసీఆర్‌ కిట్‌ను అందిస్తారు. ఎక్కడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Don't Miss