నేడు నాంపల్లి కోర్టుకు ప్రదీప్

10:26 - January 9, 2018

హైదరాబాద్ : డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో పట్టుబడిన యాంకర్‌ ప్రదీప్‌ ఎట్టకేలకు పోలీసుల ముందు హాజరయ్యారు. గోషామహల్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్టిట్యూట్‌లో కౌన్సిలింగ్‌కు హాజరయ్యారు. డిసెంబర్ 31 రాత్రి తాగి వాహనం నడుపుతూ ట్రాఫిక్‌ పోలీసులకు దొరికిన ప్రదీప్‌ తన తండ్రితో కలిసి కౌన్సిలింగ్‌ తీసుకున్నారు. ప్రదీప్‌ను పోలీసులు ఇవాళ నాంపల్లి కోర్టులో హాజరు పరచనున్నారు. 

నూతన సంవత్సర వేడుకల్లో మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డ యాంకర్ ప్రదీప్... ట్రాఫిక్ పోలీసుల ముందుకు వచ్చారు. షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్ల వారం రోజుల తర్వాత ప్రదీప్‌ ఈ కౌన్సిలింగ్‌కు హాజరయ్యారు. డిసెంబర్ 31 రాత్రి బ్రీతింగ్‌ ఎనాలసిస్‌లో 178 పాయింట్లు నమోదు కావడంతో పోలీసులు ప్రదీప్‌ వాహనాన్ని సీజ్‌ చేసి కౌన్సిలింగ్‌కు హాజరుకావాలని చెప్పారు. 

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో పట్టుబడడం తప్పేనని ఒప్పుకున్నారు ప్రదీప్‌. ఇంకెప్పుడూ అలాంటి తప్పు చేయనన్నారు. అనుకోకుండా ఆరోజు అలా జరిగిందన్నారు. తనలాంటి తప్పు మరొకరు చేయకూడదన్నారు. కౌన్సిలింగ్‌లో పాల్గొన్న ప్రదీప్‌ ఇకనుంచి నిబంధనల ప్రకారం నడుచుకుంటానని చెప్పారు. 

ఒకరికి చెప్పాల్సిన స్థానంలో ఉన్న ప్రదీప్ .. తానే ఇలా మద్యం సేవించి వాహనం నడపడంతో ప్రదీప్ కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. మంగళవారం కోర్టులో ప్రవేశ పెట్టిన తర్వాత న్యాయమూర్తి తీర్పును బట్టి ఎలాంటి శిక్ష పడుతుందన్నది న్యాయమూర్తిపై ఆధారపడి ఉందంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. దీంతో ప్రదీప్ మంగళవారం నాంపల్లి కోర్టుకు హాజరుకానున్నారు. న్యాయస్థానం ఎన్ని రోజుల శిక్ష విధిస్తుందో కూడా తేలుతుంది. 

Don't Miss