ఏపీలో స్తంభించిన జనజీవనం..

15:08 - February 8, 2018

విజయవాడ : బంద్‌ నేపథ్యంలో ఏపీలో జనజీవన వ్యవస్థ స్తంభించింది. రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయాన్ని నిరసిస్తూ అన్ని వర్గాలు స్వచ్ఛందంగా బంద్‌ చేస్తున్నాయి. ఉదయం నుంచి వామపక్ష, ప్రజాసంఘాల నేతలు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు. బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. స్కూళ్లు కాలేజీలన్నీ మూతపడ్డాయి. మరోవైపు కేంద్ర వైఖరిని నిరసిస్తూ పలు ప్రాంతాల్లో వినూత్న నిరసనలు చేపట్టారు. సామాన్యుడిపై కేంద్రం భారం మోపుతుందని,... ఏపీకి కేంద్రం అన్యాయం చేసిందంటూ నిరసనలు తెలుపుతున్నారు. వామపక్షాల బంద్‌కు వైసీపీ మద్దతివ్వడమే కాకుండా.. పలు చోట్ల ధర్నాలు, నిరసనలు తెలుపుతున్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ గుంటూరులోని లాడ్జ్‌ సెంటర్‌లో టీడీపీ నేతలు నిరసన చేపట్టారు. పార్లమెంట్‌లో టీడీపీ ఎంపీల నిరసనకు మద్దతు తెలిపారు.

మోకాళ్లపై నిలబడిన జనసేన నేతలు..
విజయవాడ :
ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్షాల బంద్‌కు మద్దతుగా జనసేన పార్టీ వినూత్న రీతిలో నిరసన తెలిపింది. మోకాళ్ళపై నిలబడి కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. ఎన్నికల్లో హామీలను నెరవేర్చకపోగా.. బడ్జెట్‌లో కూడా ఏపీకి తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు. జనసేన నేతల మోకాళ్ళ నిరసనపై మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

విశాఖలో..
బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ విశాఖలో వామపక్షాలు చేపట్టిన బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. బంద్‌కు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు పలికాయి. చిన్నారులు సైతం బంద్‌లో పాల్గొన్నారు. స్కూళ్లు, దుకాణాలు మూతపడ్డాయి. జాతీయ రహదారిపై వామపక్ష నాయకులు బైఠాయించారు. రాష్ట్ర హక్కుల సాధనకై ప్రభుత్వం కూడా బంద్‌లో ప్రత్యక్షంగా పాల్గొనాల్సిన అవసరం ఉందని వామపక్ష నేతలు పేర్కొన్నారు.

నెల్లూరులో....
నెల్లూరు జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. పాఠశాలలు, కాలేజీ యాజమాన్యాలు బంద్‌కు మద్దతు తెలుపుతూ స్వచ్ఛందంగా సెలవు ప్రకటించారు. నెల్లూరులో జరుగుతున్న బంద్‌పై మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

అనంతపురంలో...
అనంతపురంలో సీపీఎం వినుత్నంగా నిరసన ర్యాలీ చేపట్టింది. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చకుండా.. వెనుకబడిన రాయలసీమకు ప్రత్యేక నిధులు కేటాయించకుండా కేంద్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందంటూ మండిపడింది. ఐద్వా మహిళా సంఘం మరియు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. దీనిపై మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

Don't Miss