ఐక్యరాజ్య సమితిలో పాల్గొనటం నా అదృష్టం..

07:46 - September 25, 2018

అమెరికా  : ఐక్యరాజ్య సమితిలో మాట్లాడే అరుదైన అవకాశం దక్కించుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. కొద్దిసేపటి క్రితం ప్రసంగాన్ని తెలుగులోనే ప్రారంభించారు. ఐక్యరాజ్య సమితిలో పాల్గొనే అరుదైన అవకాశం దక్కటం అదృష్టంగా భావిస్తున్నానని చంద్రబాబు తెలిపారు. ప్రపంచ ఆర్థిక వేదిక, బ్లూంబర్గ్ గ్లోబల్ బిజినెస్ ఫోరం ఆధ్వర్యంలో ‘సుస్థిర సేద్యానికి ఆర్థిక చేయూత: అంతర్జాతీయ సవాళ్లు-అవకాశాలు’ అనే అంశంపై చంద్రబాబు తన ప్రసంగాన్ని ప్రారంభించారు. మనమంతా రసాయన ఎరువులతో పండించిన పంటలనే తింటున్నామన్నారు. ప్రకృతి వ్యవసాయంలో ఏపీ కొత్త ఒరవడి సృష్టిస్తోందన్నారు. ఐటీ నిపుణులు కూడా వ్యవసాయం వైపు దృష్టి సారిస్తున్నట్టు చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీలో ప్రకృతి వ్యవసాయం ప్రపంచానికే ఆదర్శమన్నారు. ప్రకృతి వ్యవసాయం వల్ల భూమి కలుషితం కాదన్నారు. అంతేకాక, పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న ప్రకృతి సేద్యం తీరుతెన్నులను వివరించారు. అమ్మ జన్మ మాత్రమే ఇస్తే.. భూమి ఆహారం నుంచి అన్నీ ఇస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు అన్నపూర్ణ అనే పేరు కూడా ఉందన్నారు. జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయం వల్లే రైతులకు పెట్టుబడి తగ్గుతుందన్నారు. రసాయన ఎరువుల వాడకం వల్ల పంట దిగుబడుల్లో నాణ్యత లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కారణంగానే అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగంలో పేర్కొన్నారు.

 

Don't Miss