యోగి సమాధానం చెప్పాలన్న కల్పన...

13:37 - September 30, 2018

ఉత్తర్ ప్రదేశ్ : తన భర్త మరణానికి రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సమాధానం చెప్పాలని తివారీ భార్య కల్పన డిమాండ్‌ చేశారు. తన భర్త ఉగ్రవాదా? అని ప్రశ్నించారు. తనకు రూ.కోటి పరిహారం, పోలీసు శాఖలో ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ సీఎంకు ఆమె లేఖ రాశారు. తివారీ, కల్పన దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తివారీ మృతికి బాధ్యులైన ఆ ఇద్దరు కానిస్టేబుళ్లను అరెస్టు చేశారు. వారిని సర్వీసు నుంచి తొలగించనున్నట్లు రాష్ట్ర డీజీపీ ఓపీ సింగ్‌ తెలిపారు. ఆత్మ రక్షణ పరిమితులను దాటి వారు అతిగా వ్యవహరించినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైందని అన్నారు. ఎవరినీ కాల్చేందుకు పోలీసులకు అనుమతి లేదని స్పష్టం చేశారు. 

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ యువకుడిని పోలీస్ కానిస్టేబుల్ కాల్చిచంపిన ఘటన సంచలనం రేపుతోంది. తనిఖీల సమయంలో కారు ఆపలేదన్న కారణంతో నిండు ప్రాణాలు బలి తీసుకోవడం లక్నోలో కలకలం రేపుతోంది. ఈ ఘటనపై పోలీసులు వ్యవహరించిన తీరు, రాష్ట్రంలో పెరిగిన ఎన్‌కౌంటర్ల సంస్కృతి పై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. లక్నోలోని విలాసవంతమైన గోమతీనగర్‌ ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. ప్రశాంత్‌ చౌధరి అనే కానిస్టేబుల్‌ జరిపిన కాల్పుల్లో మృతి చెందిన వివేక్ తివారీ యాపిల్ కంపెనీ ఉద్యోగి. తివారీ విధులు ముగించుకొని వస్తున్న సమయంలో గస్తీ కాస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు ఆయన వాహనాన్ని ఆపమని కోరారు. కానీ ఆప కుండా ముందుకు పోవడంతో కానిస్టేబుల్ కాల్పులు జరిపాడు. ఈఘటనలో తివారీ అక్కడే మృతి చెందాడు. ఈసమయంలో కారులో మరో మహిళ కూడా ఉన్నారు.

Don't Miss