'ఇది కథకాదు'... కార్యక్రమానికి ఆరాధన పురస్కారం

17:05 - April 28, 2016

హైదరాబాద్ : మనసు, మమత, మాధుర్యాల కలబోత మానవత.... గుప్పెడు గుండె చప్పుడే జీవన మనుగడ.... బంధం, అనుబంధం, సంబంధాల సమ్మేళనమే కుటుంబ సరాగం.. సంసార సాగరం. చిన్న అపశ్రుతి.. క్షణికావేశం.. కట్టుతప్పిన ఆలోచన.. తప్పుదారి పట్టిన అలవాటు బ్రతుకు నావకు చిల్లు పొడిస్తే మునిగిపోతున్న కుటుంబాలెన్నో.. మరుగున పడుతున్న వ్యథార్థ గాథలెన్నెన్నో.. ఈ నిజం దృశ్యం కావాలి. కనువిప్పు తేవాలి. కారుణ్యం కురిపించాలి...ఇది కథ కాదు. యథార్థ గాథల అల్లిక ..నవ చేతనా మాలిక... సగర్వంగా ..సాదృశ్యంగా ..సౌమనస్యంగా ప్రసరించే చీకటి వెలుగుల కొత్త కోణం. ఎస్ ...ఇట్స్ ఎ రియల్ స్టోరీ.. ఈ నిజాలకే నిలువెత్తు పట్టం ..ఆరాధన ,శ్రీకరీ ఉత్తమ కార్యక్రమ పురస్కారం. అశేషంగా ..విశేషంగా ఆదరిస్తున్న 10 టీవీ ప్రేక్షకులకే ఇది సమర్పణం.

ఒ క భావోద్వేగం నిలువెల్లా....

ఒ క భావోద్వేగం నిలువెల్లా కమ్ముకుంటుంది. మాటలు చేతలుగా మారుతాయి. అందుబాటులోని వస్తువులే అస్ర్తాలుగా రూపుదాలుస్తాయి. ఆవేశం చల్లారుతుంది. అక్కడేం మిగులుతుంది. రక్తపాతం. హత్య. తిరిగి చూస్తే కన్నీటి సంద్రంగా మారిన కుటుంబం. చెరసాల ఊచలు లెక్కిస్తున్న ఇంటి పెద్ద. అనాథలైపోయిన చిన్నారులు. ఎందుకిలా? మూలమూలల్లో దాగి ఉన్న అహం...ఆవేశం...అప్పుడప్పుడూ తొంగి చూస్తుంది. రాక్షస ప్రవృత్తిని తట్టి లేపుతుంది. పర్యవసానాలు అగమ్య గోచరం. ఆ క్షణం సృష్టించే ఘోరం. విలయం ..కుటుంబంలోని కల్లోలం కళ్లముందు కదలాడితే ఈ దారుణం దరికే వెళ్లరు. కానీ చిత్తం..చెప్పినట్లు వినదు. పర్యవసానమే ఇది కథ కాదు. అన్ వాన్టెడ్ క్రైమ్ కహానీ .. ఎ రియల్ స్టోరీ.

అల్లారుముద్దుగా పెంచిన చిన్నారిని...

అల్లారుముద్దుగా పెంచిన చిన్నారిని అత్తింటికి పంపుతారు ఆ అమ్మానాన్న. పిల్లాపాపలతో కలకలం వర్ధిల్లమంటూ అప్పగింతలు చెబుతారు. ఆశీర్వదిస్తారు. అత్తామామల అత్యాశ ..బంగారు బాతుగా కోడలిని కాసుల కోసం కాటికి పంపే ఉన్మాదం ఆ పెళ్లి కూతురు ఉసురు తీస్తుంది. ఏడడుగులు నడిచి ఎన్నెన్నో ఆశల సౌధాలు నిర్మించుకున్న ఆ అమాయకురాలి కన్నీటి కాష్టం రగులుతుంది. అత్తామామల ముసుగులోని మానవమురుగాలు రాసిన మరణశాసనం ఆమె పిల్లలకు తీరని శాపమై జీవితాంతం వెన్నాడుతూనే ఉంటుంది. ఈ ప్రశ్నకు బదులేది? చట్టం చెప్పే తీర్పు ..వసి వాడని ఈ బాల్యానికి న్యాయం చేస్తుందా? ఈ కన్నీటి కథ సమాజానికి కనువిప్పు కావాలి. అత్తింటి ఆరళ్లతో వేధించే చాందస ధనపిపాసులకు దండన తప్పదన్న కఠోరవాస్తవం కళ్లముందు నిలవాలి. అందుకే ఇది కథ కాదు... ఏ రియల్ డిజైరబుల్ రిజల్ట్..

విధి నిర్వహణలో సర్వం కోల్పోయి...

విధి నిర్వహణలో సర్వం కోల్పోయాడు. నిబంధనల చట్రం అతనిని చీదరించింది. కనీస సాయాన్నీ నిరాకరించింది. డిపార్టుమెంటుతో డీ కొట్టే సత్తా లేక మానసిక వైకల్యంతో మంచాన పడ్డాడో ఎస్.ఐ. ఆలి కూలీగా మారింది. మనో వ్యధతో బతుకు భారాన్ని మోస్తోంది. ప్రభుత్వానికి పట్టదు. కారుణ్యం మాటే గిట్టదు. దాదాపు యాభైవేల మందితో కూడిన రక్షక భట శాఖలోనే పాపం ఈ అభాగ్యునికి రక్షణ కరవైంది. ఆర్థికంగా అండ మరుగ్యమైంది.. ఇదెక్కడి అన్యాయం అన్న ప్రశ్నే వినిపించదు. నిగ్గదీసి అడిగే ఆ గళమే ఇది కథ కాదు. పరిపాలన లోపాలపై పవర్ పుల్ వెపన్. ఎ రియల్ స్టోరీ...

కలకంఠి కంట కన్నీరొలికిన సిరి ఇంట నుండ నొల్లదు..

కలకంఠి కంట కన్నీరొలికిన సిరి ఇంట నుండ నొల్లదు... అంటుంది భారత సాహిత్యం. ఆ కాంతనే కాసుల కోసం వల వేసే కామపిశాచులు రాజ్యం చేస్తున్నారు నిత్యం. తెర కెక్కిన ఈ అతివ గుండె ఘోష ప్రతిధ్వనింప చేసే కాల్ మనీ కథలెన్నో...ప్రేమించి పెళ్లాడిన భర్తకు దూరమై... క్షణం ..క్షణం నరకయాతనతో తనువును తాకట్టు పెట్టి ఆమె అనుభవించిన వ్యథ ఆత్మహత్యగా జలసమాధి అయిపోయింది. అభంశుభం తెలియని అయిదేళ్ల పిల్లాడి అన్వేషణకు,..అమ్మా అన్న పిలుపునకు అక్షరరూపమే ఇది కథ కాదు. వడ్డికాసురుల వికృత విన్యాసాలపై ఎక్కపెట్టిన దృశ్య శస్త్రం ఇది కథ కాదు. ఏ రియల్ రివోల్డ్ ఎగైన్ స్ట్ సెక్సువల్ ఎక్స్ ప్లాయిటేషన్..

వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. ...

వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. నాకు నువ్వు నీకు నేను అంటూ ఊసులు చెప్పుకున్నారు. బాసలు చేసుకున్నారు. సంప్రదాయం అడ్డు చెప్పింది.'వైవాహికేతర సంబంధం కాదు కూడదు'అంటూ గ్రామం నిలదీసింది. అప్పటికే ఎదిగొచ్చిన వారి పిల్లలు నోళ్లు వెళ్లబెట్టారు. అటు కట్టుబాట్లు, ఇటు ప్రేమైక భావన ల మధ్య నలిగిపోయారా ప్రేయసీ ప్రియులు. తమను కాదన్న సంఘాన్ని తామే వెలివేస్తున్నామన్నారు. చాటుమాటుగా బతకడం తమ వల్ల కాదని తెగించేశారు. ప్రాణాలు ఉరికొయ్యలకు తాళ్లుగా మారిపోయాయి. పిల్లలు గూడు చెదిరిన గువ్వలై పోయారు. ఇరు కుటుంబాల జీవితం రెక్కలు తెగిన పక్షిలా మారిపోయింది. మానవ సంబంధాల పరిమితులు, పరిధులు, సాంఘిక ఆచారాల సరిహద్దుల్లో ఎదురైన సంకటమే వీరి సమస్య. ఎదురొడ్డి పోరాడే స్థైర్యం సంపాదించలేకపోవడమే బలహీనత. ఇదో పాఠం. ఆకర్షణల వలయంలో అతలాకుతలమయ్యే జీవన చక్రాలకు ప్రతిబింబం. అదే ఇది కథ కాదు. రియల్ సైకలాజికల్ స్ట్రగుల్ .. సొసైటీకి సో సారీ ...రేరెస్ట్ ఆఫ్ ద రేర్ స్టోరీ

బహుముఖ జీవన చిత్రాలు...

బహుముఖ జీవన చిత్రాలు... సామాజిక నడవడికలో క్షణ క్షణం ఎదురయ్యే సమస్యల విషవలయాలు.. భావోద్వేగాలు..బతుకు పాఠాలు. సుఖదు:ఖాల సమతులనం లోపించి అర్ధాంతరంగా ముగిసిపోయిన అభాగ్యుల వెతలు. కన్నీటి కథలు. నేరం ..ఆర్థిక భారం చెట్టాపట్టాలేసుకుని సాగిపోతున్న సాంఘిక వైరుద్ధ్యం. ఈ తీరు మారాలి. విద్యావేత్తలు, మేధావులు, సంఘ సంస్కర్తలు, మానసిక నిపుణులు ముందుకు రావాలి. అవగాహన భేరీ మోగించాలి. ఈ రియల్ స్టోరీలు చూసైనా వేన వేల కుటుంబాల్లో ఆలోచన రేకెత్తాలి. అదే లక్ష్యంతో ముందుకు సాగుతోంది ఈ కథా ప్రస్థానం. ఆరాధన..శ్రీకరి ఉత్తమ కథా పురస్కారం ఇందుకు లభించిన సముచిత గుర్తింపు. సమధికోత్సాహానికి ప్రోత్సాహం. 

Don't Miss