'నెహ్రా' గుడ్ బై ?..

10:23 - October 12, 2017

టీమిండియా వెటరన్ పేసర్ 'ఆశీష్ నెహ్రా' అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పబోతున్నారా ? దీనిపై ప్రస్తుతం సోషల్ మాధ్యమాల్లో వార్తలు వెలువడుతున్నాయి. నవంబర్ నెలలో భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ చివరి మ్యాచ్ అని ప్రచారం జరుగుతోంది. ముంబై మిర్రర్ పత్రిక ఈ కథనాన్ని ప్రచురించిందని తెలుస్తోంది.

సుమారు తొమ్మిది నెలల విరామం తర్వాత నెహ్రా ఆసీస్‌తో ప్రస్తుతం జరుగుతున్న టీ20 సిరిస్‌లో బీసీసీఐ ఎంపిక చేసిన 15మంది జట్టులో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే రాంచీలో జరిగిన తొలి టీ -20 కోసం ఎంపిక చేసిన తుది జట్టులో మాత్రం నెహ్రాకు స్థానం దక్కలేదు. ఈ నేపథ్యంలో నెహ్రా అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పనున్నాడనే వార్త హల్ చల్ చేస్తోంది.

నవంబర్ 1న ఢిల్లీలోని ఫిరోషా కోట్లా మైదానంలో న్యూజిలాండ్ తో మ్యాచ్ జరుగనుంది. దీనితో సొంత స్టేడియం కావడంతో ఇక్కడే రిటైర్ మెంట్ ప్రకటించాలని నెహ్రా యోచిస్తున్నట్లు టాక్. సొంత మైదానంలో అభిమానుల మధ్య వీడ్కోలు పలకాలనే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది షెడ్యూల్ ప్రకారం టీ 20 ప్రపంచకప్ జరిగే అవకాశం లేకపోవడంతో నెహ్రా రిటైర్ మెంట్ కు కారణమని తెలుస్తోంది.

1999లో అంతర్జాతీయ క్రికెట్ లో నెహ్రా ఆరంగ్రేటం చేశాడు. భారత్ తరపున 17 టెస్టులు..120 వన్డేలు..26 టీ-20 మ్యాచ్ లు ఆడాడు. నెహ్రా చివరిసారిగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20లో భారత్ తరపున ఆడాడు. ఇప్పటి వరకు 26 టీ20లు ఆడిన నెహ్రా 34 వికెట్లు తీశాడు.

Don't Miss