ఆసియా కప్‌ షెడ్యూల్‌...

08:00 - September 14, 2018
ఢిల్లీ : ఆసియాకప్‌ చరిత్రలో ఆరుసార్లు విజేతగా నిలిచిన  టీమ్‌ఇండియా..తమకు కలిసొచ్చిన టోర్నీలో మరోసారి  కలబడుతోంది. ఆసియా క్రికెట్‌ దేశాల మధ్య స్నేహపూర్వక  వాతావరణం పెంపొందించడం కోసం 1983లో తొలిసారిగా  ఆసియాకప్‌ నిర్వహించారు. ఆసియాక్రికెట్‌ కౌన్సిల్‌ నిర్వహణ  బాధ్యతలు చూసుకుంది. అయితే 2015 నుంచి ఐసీసీ దీనిని  నిర్వహిస్తోంది. ప్రతీ రెండేళ్లకోసారి జరిగే ఈ టోర్నీని ఒకసారి  టీ20 కప్‌గా, మరోసారి వన్డే కప్‌గా రొటేషన్‌ పద్ధతిలో  జరుపుతున్నారు. చివరిసారిగా 2016లో జరిగిన టీ20  కప్‌లో భారత్‌ విజేతగా నిలిచింది.

ఎప్పటిలాగే ఈసారి కూడా మిగతా జట్ల కంటే టీమ్‌ఇండియానే  పటిష్టంగా కనిపిస్తున్నది. రోహిత్‌శర్మ, శిఖర్‌ ధవన్‌, కేఎల్‌  రాహుల్‌, మనీశ్‌ పాండే, కేదార్‌ జాదవ్‌, ఎంఎస్‌ ధోనీ, హార్దిక్  పాండ్యతో బ్యాటింగ్‌ లైనప్‌ బలంగా ఉంది. బుమ్రా, భువనేశ్వర్‌,  శార్దూల్‌తో పేస్‌ ఎటాక్...చాహల్‌, కుల్దీప్‌, అక్షర్‌ పటేల్‌తో స్పిన్‌  ఎటాక్‌ సైతం స్ట్రాంగ్‌గా ఉంది. యువ పేసర్‌ ఖలీల్‌ అహ్మద్‌  ప్రదర్శనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. భారత్‌ తన తొలి మ్యాచ్‌ను  సెప్టెంబర్‌ 18న హాంకాంగ్‌తో ఆడుతుంది. మరుసటి రోజు సెప్టెంబర్‌ 19న చిరకాల ప్రత్యర్థి పాక్‌తో తలపడుతుంది.

భారత్‌ తర్వాత శ్రీలంక అత్యధికంగా ఐదు సార్లు ఆసియాకప్  గెలిచింది. లంక..ఈసారి అంత బలంగా కనిపించకపోయినా,  యువ క్రికెటర్లతో జట్టు సమతూకంలోనే ఉన్నది. కెప్టెన్‌  మాథ్యూస్‌కు తోడు సీనియర్‌ బౌలర్‌ లసిత్‌ మలింగ జట్టులో  చేరడం లంకకు కలిసొచ్చే అంశం. గాయం కారణంగా దినేశ్‌ చండిమాల్‌ ఆఖరి నిమిషంలో తప్పుకోవడం ఆ జట్టును కొంత కలవరపరిచే అంశం. అటు బంగ్లాదేశ్‌ కూడా బలంగా  కనిపిస్తోంది. కెప్టెన్‌ మొర్తజా, ఆల్‌రౌండర్‌ షకీబ్‌, ముష్పికర్‌  రహీమ్‌, మహ్మదుల్లా జట్టులో కీలకపాత్ర పోషించనున్నారు. దీంతో తొలి మ్యాచ్‌ కావల్సినంత కిక్‌ ఇవ్వడం ఖాయం.

సర్ఫరాజ్‌ నాయకత్వంలోని పాకిస్థాన్‌ జట్టులో షోయబ్‌ మాలిక్‌  మినహా మిగతా వారందరూ యువ క్రికెటర్లే. బాబర్‌ అజామ్‌,  ఫక్హర్‌ జమాన్‌, మహ్మద్‌ అమీర్‌, జునైద్ ఖాన్‌ కీలక ఆటగాళ్లు.  పాక్‌ తన తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్‌ 16న హాంకాంగ్‌తో  ఆడుతుంది. మరోవైపు పసికూనలు అనే ముద్ర చేరిపేసుకునేందుకు  ఆఫ్ఘనిస్థాన్‌ సిద్ధమైంది. కెప్టెన్‌ అస్గర్‌ ఆఫ్ఘాన్‌తో పాటు మహ్మద్‌ నబి వంటి సీనియర్లుండగా...స్పిన్‌ సంచలనాలు రషీద్‌ఖాన్‌, ముజీబుర్‌ రహ్మన్‌ ప్రత్యర్థులకు సవాల్‌ విసురుతున్నారు. పెద్ద జట్లకు షాక్‌ ఇవ్వాలని తహతహలాడుతున్న ఆఫ్ఘన్‌ సెప్టెంబర్‌  17న శ్రీలంకతో తమ తొలి మ్యాచ్‌ ఆడుతుంది. మొత్తానికి క్రికెట్‌ అభిమానులను 14 రోజుల పాటు అలరించేందుకు ఆసియాకప్‌ సిద్ధమైంది.

ఆసియా కప్‌ షెడ్యూల్‌
సెప్టెంబర్‌ 15 – బంగ్లాదేశ్‌ × శ్రీలంక
సెప్టెంబర్‌16 – పాకిస్థాన్‌ × హాంకాంగ్‌
సెప్టెంబర్‌17 – శ్రీలంక × అఫ్గానిస్తాన్‌
సెప్టెంబర్‌18 – భారత్‌ × హాంకాంగ్‌
సెప్టెంబర్‌19 – భారత్‌ × పాకిస్థాన్‌
సెప్టెంబర్‌20 – బంగ్లాదేశ్‌ × అఫ్గానిస్థాన్‌
సెప్టెంబర్‌21 – Supe 4 మ్యాచ్‌ 1, 2
సెప్టెంబర్‌23 – Super 4 మ్యాచ్‌ 3, 4
సెప్టెంబర్‌25 – Super 4 మ్యాచ్‌ 5
సెప్టెంబర్‌26 – Super 4 మ్యాచ్‌ 6
సెప్టెంబర్‌28 – ఫైనల్‌

Don't Miss