దుమ్మురేపిన భారత హాకీ మహిళలు..

21:31 - November 5, 2017

ఢిల్లీ : భారత హాకీ మహిళలు దుమ్మురేపారు. తిరుగులేని ప్రదర్శనతో ఆసియాకప్‌ కైవసం చేసుకొన్నారు. నువ్వానేనా అన్నట్టు జరిగిన ఫైనల్లో చైనాపై 5-4 తేడాతో విజయం సాధించారు. నవ్‌జ్యోత్‌ కౌర్‌ 25వ నిమిషంలో గోల్‌ చేయడంతో తొలుత టీమిండియా 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత తియాన్‌తియాన్‌లువో 47వ నిమిషంలో గోల్‌ కొట్టడంతో చైనా 1-1 తో స్కోర్‌ను సమం చేసింది. మ్యాచ్‌ ముగిసే సరికి మరో గోల్‌ నమోదు కాకపోవడంతో షూటౌట్‌ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఉత్కంఠకరంగా సాగిన షూటౌట్‌లో రెండు జట్లు 4-4తో నిలిచాయి. చివరి అవకాశంలో కెప్టెన్‌ రాణి గోల్‌ కొట్టింది. ఆ తర్వాత చైనా విఫలం కావడంతో భారత్‌ 5-4తో గెలుపొందింది. గ్రూప్‌ దశలోనూ చైనాను టీమిండియా ఓడించింది. ఈ విజయంతో.. అమ్మాయిలు, అబ్బాయిలు ఆసియాకప్‌ గెలిచినట్టైంది. ఆసియాకప్‌ విజేతగా నిలిచిన భారత్‌ 2018లో జరిగే మహిళల ప్రపంచకప్‌కు నేరుగా అర్హత పొందింది.

Don't Miss