ఔరా!బ్యాంక్ సిబ్బంది హస్త లాఘవం!!

16:04 - May 30, 2018

ఖమ్మం : బ్యాంకుల్లోనే సామాన్యుల డబ్బులకు రక్షణ లేకుండా పోతోంది. కష్టపడి సంపాదించుకున్న డబ్బులు బ్యాంకులో దాచుకుంటే.. వాటినే లూటీ చేస్తున్నారు. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడన్న చందంగా... బ్యాంకు సిబ్బంది... మరో వ్యక్తి కలిసి నిరుపేద మహిళ దాచుకున్న డబ్బులు కాజేశారు. కూతుళ్ల పెళ్లిళ్ల కోసం దాచుకున్న డబ్బు మాయమవడంతో బాధితురాలు లబోదిబో మంటోంది. ఖమ్మం జిల్లా అశ్వరావుపేటలోని ఎస్‌బీఐలో డబ్బుల అదృశ్యంపై కథనం...

బ్యాంకుల్లో పేదవారి డబ్బుకు లేని రక్షణ
బ్యాంకుల్లోనే పేదవారి డబ్బుకు రక్షణ లేకుండా పోతోంది. పైసాపైసా కూడబెట్టి దాచుకున్న డబ్బును మాయం చేస్తున్నారు అక్రమార్కులు. ఇక్కడ కనిపిస్తున్న వీరీ అఫ్జల్‌ పాషా, షాహీన్‌బేగం. వీరిది నిరుపేద కుటుంబం. వీరికి నలుగురు ఆడపిల్లలు. చిన్న వ్యాపారంతో రూపాయి రూపాయి కూడబెట్టారు. కష్టపడి సంపాదించిన డబ్బు భద్రంగా ఉండాలంటే బ్యాంకులో వేయాలనుకున్నారు. దీంతో ఖమ్మం జిల్లా అశ్వరావుపేట బీసీఎం రోడ్డులోని స్టేట్‌ బ్యాంక్‌లో షాహీన్‌బేగం పేరుతో అకౌంట్‌ ఓపెన్‌ చేశారు. లక్షన్నర రూపాయలకు పైగా అందులో జమ చేశారు.

రూ. 80వేల వరకు డ్రా చేసిన గుర్తు తెలియని వ్యక్తులు
ఇక్కడి వరకు కథ బాగానే ఉంది. ఇక్కడే అసలు కథ మొదలైంది. కూతురికి పెళ్లి కుదరడంతో డబ్బుకోసం షాహీన్‌బేగం బ్యాంకు వెళ్లింది. తన ఖాతాలోని నగదు డ్రా చేసి ఇవ్వాలని కోరింది. కానీ ఆమె అకౌంట్‌లో దాచుకున్న నగదు మాయమైంది. పైసాపైసా కూడబెట్టి దాచుకున్న డబ్బును ఎవరో కాజేశారు. దాదాపు తన ఖాతా నుంచి 80వేల వరకు డ్రా చేశారు. దీంతో ఆమె బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌ కోసం దరఖాస్తు చేయగా... ఏటీఎం అప్లికేషన్‌ను కూడా తీసుకోవాలని బ్యాంక్‌ సిబ్బంది చెబుతున్నారని వాపోయింది. చివరికి తన ఖాతాలోని డబ్బును ఏటీఎం ద్వారా డ్రా చేసినట్టు తేలింది. అసలు తాను ఏటీఎం తీసుకోలేదని.... తన ఖాతాలోని డబ్బును ఏటీఎంతో ఎలా డ్రా చేస్తారని బాధితురాలు వాపోయింది. అకౌంట్‌లోని డబ్బుల మాయంపై బ్యాంక్‌ మేనేజర్‌ను బాధితురాలు నిలదీసింది. దీంతో బ్యాంక్‌ మేనేజర్‌ పోలీస్‌ స్టేషన్‌ను వెళ్లవద్దని.... తగిన న్యాయం చేస్తానని చెప్పినట్టు బాధితురాలు చెబుతోంది.

ఖాతాదారుకి తెలియకుండా ఏటీఎం తీసుకున్న
నగదు మాయం వెనుకు నయీమ్‌ అనే యువకుడి హస్తం ఉన్నట్టు తెలస్తోంది. అతడే ఏటీఎం తీసుకుని డబ్బులు డ్రా చేసినట్టు తెలుస్తోంది. దీనికి బ్యాంక్‌ సిబ్బంది అండదండలు ఇచ్చినట్టు సమాచారం. ఖాతాదారుకే ఇవ్వాల్సిన ఏటీఎంను సంబంధంలేని వ్యక్తికి ఇచ్చి... అక్రమాలకు బ్యాంక్‌ సిబ్బందే ప్రోత్సహించారు. ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. లేకుండా న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తామని చెబుతున్నారు.

Don't Miss