సమయానికి కాలేజీకి రావడంలేదని...

16:38 - August 19, 2017

జగిత్యాల : రోజూ కాలేజీకి ఆలస్యంగా వస్తున్నారు.. ఇది సరికాదని చెప్పినా మార్పులేదు... ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మిగతా విద్యార్థులూ క్రమశిక్షణ తప్పుతారు.. అందుకే విద్యార్థులకు బుద్ధి చెప్పాలనుకున్నాడో లెక్చరర్‌.. పనిష్‌మెంట్‌పేరుతో ఏకంగా జుట్టే కత్తిరించాడు.. ఇది కాస్తా వివాదాస్పదం కావడంతో జుట్టు కత్తిరింపుకూ తమకూ సంబంధం లేదన్నారు.. ఇందులో ఎవరిది నిజం?
కామర్స్‌ లెక్చరర్‌ జుట్టు కత్తిరింపు
జగిత్యాల జిల్లా ధర్మపురిలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో 450 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.. వీరిలో 350మంది బాలికలు, వందమంది బాలురున్నారు.. కొద్దిరోజులుగా కొందరు విద్యార్థుల సమయానికి కాలేజీకి రావడంలేదని జువాలజీ అధ్యాపకుడు మందలించారు.. అయినా ఎలాంటి మార్పూ రాకపోవడంతో తన క్యాబిన్‌కు పిలిపించారు.. రాజిరెడ్డి ఆదేశాలతో కామర్స్‌ లెక్చరర్‌ విద్యార్థుల జుట్టు కత్తిరించారు.. 
గుండు చేయించుకున్న కొందరు విద్యార్థులు
కాలేజీలో ఇలా ఇష్టంవచ్చినట్లు జుట్టును కట్‌ చేయడంతో విద్యార్థులు మనస్తాపం చెందారు.... తోటి విద్యార్థులు ఎగతాళి చేస్తారని కొందరు సెలూన్‌కువెళ్లి గుండు చేయించుకున్నారు... మరికొందరు కాలేజీకి రావడమే మానేశారు. అయితే జుట్టు కత్తిరింపుకు తమకు ఎలాంటి సంబంధంలేదని లెక్చరర్లు స్పష్టం చేస్తున్నారు.. విద్యార్థులు టీసీ అడిగారని... ఇవ్వనందుకే ఇలా చేస్తున్నారని సమాధానమిస్తున్నారు. ఏది ఏమైనా నిజానిజాలు తేలాలంటే ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరగాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.. ఇంటర్‌ బోర్డు అధికారులు విచారణ జరిపి బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.. 
 

 

Don't Miss