రోడ్డెక్కిన బీసీ హాస్టల్ విద్యార్థులు...

17:14 - January 28, 2018

రాజన్న సిరిసిల్ల : బీసీ హాస్టల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు...వారికి సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతున్నామని చెబుతున్న ప్రభుత్వ మాటలు వట్టివేనని పలు ఘటనలు చూపిస్తున్నాయి. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ మండలం ఆవునూరులో బీసీ విద్యార్థులు రోడెక్కారు. సాక్షాత్తూ మంత్రి కేటీఆర్ ప్రాతినథ్యం వహిస్తున్న సొంత జిల్లాలో ఈ ఘటన జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. హాస్టల్ లో ఎన్నో సమస్యలున్నా అధికారులు, యాజమాన్యం స్పందించడం లేదని విద్యార్థులు పేర్కొంటున్నారు. ఆదివారం 150 మంది విద్యార్థులు ఆందోళన చేపట్టారు. నాలుగు గంటల పాటు ఆందోళన చేసినా అధికారుల నుండి ఎలాంటి స్పందన రాలేదు. భోజనం సరిగ్గా లేదని..నాణ్యమైన ఆహారం పెట్టడం లేదని..తాగునీటి సమస్య అధికంగా ఉందని విద్యార్థులు పేర్కొంటున్నారు. కలుషితమైన నీటిని సేవించడం వల్ల అనారోగ్యాల బారిన పడుతున్నారని తల్లిదండ్రులు తెలిపారు. 150 మంది ఉన్న ఒక్కో గదిలో 30 మందిని ఉంచుతున్నారని, దీనివల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి విద్యార్థుల సమస్యను పరిష్కరిస్తారా ? లేదా ? అనేది చూడాలి. 

Don't Miss