బీజేపీ అగ్రనేతలకు 'బాబ్రీ' షాక్..

11:23 - April 19, 2017

ఢిల్లీ : బీజేపీ అగ్రనేతలకు షాక్ తగిలింది. బాబ్రీ కేసులో బీజేపీ పార్టీలో అగ్రనేతలుగా చలామణి అవుతున్న వారికి ఎదురుదెబ్బ తగిలినట్లైంది. అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతితో సహా బీజేపీ నేతలపై కేసుల పునరుద్ధరణకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. 16 మందిపై కేసుల పునరుద్ధరణకు, ఈ కేసును లక్నోలోని ట్రయల్ కోర్టుకు బదిలీ చేసింది. ఈ సందర్భంగా అలహాబాద్ కోర్టు తీర్పును సుప్రీం పక్కకు పెట్టడం విశేషం. రోజు వారీ విచారణ చేపట్టి రెండేళ్లలో విచారణ పూర్తి చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అయితే బాబ్రీ కేసు నుండి కల్యాణ్ సింగ్ కు మినహాయింపునిచ్చింది. రాజస్థాన్ గవర్నర్ గా ఉన్నంత వరకు ఆయనకు మినహాయింపు ఇచ్చింది. గతంలో విచారణ నుండి అద్వానీని అలహాబాద్ కోర్టు మినహాయించిన సంగతి తెలిసిందే. ఒక్కసారిగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో బీజేపీలో కలకలం రేగినట్లు తెలుస్తోంది. ప్రధాన మంత్రి రేసులో..ప్రస్తుతం రాష్ట్రపతి రేసులో ఉన్న అద్వానీపై ఈ కేసు ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

 • 1989లో రాజీవ్ గాంధీ ఓటు బ్యాంకు రాజకీయాలకు తెరలేపారనే వాదనలు ఉన్నాయి.
 • మసీదు గేట్లు ఓపెన్ చేయాలని చెప్పారు. దీంతో విహెచ్‌పీ, ఆరెస్సెస్ వంటి హిందుత్వ సంస్థలు, బీజేపీ పార్టీ.. అక్కడ రామాలయం నిర్మించేందుకు ప్రచారం ప్రారంభించింది.
 • ఈ నేపథ్యంలో అద్వానీ రథయాత్ర ప్రారంభించారు. ఆ తర్వాత మసీదు కూల్చివేత ఘటనలు చోటు చేసుకున్నాయి.
 • 400 ఏళ్ల నాటి మసీదును కూల్చేశారు. అక్కడ అంతకుముందు ఉన్న రామాలయాన్ని కట్టాలని డిమాండ్ చేశారు.
 • 1992లో ప్రభుత్వం మసీదు కూల్చివేత ఘటనపై లిబర్హాన్ కమిటీని వేసింది. అందులో పలువురు బీజేపీ నేతల పేర్లు ఉన్నాయి.
 • అద్వానీ, ఉమాభారతి, జోషి, కల్యాణ్ సింగ్ తో సహా మొత్తం 22 మంది నేతలు గుర్తు తెలియని కరసేవకులను ప్రోత్సాహించారని కేసు నమోదైంది.
 • రాయ్ బరేలీ ప్రత్యేక కోర్టు 2001, మే 4న విచారణ నుంచి తప్పించింది. వారిపై తగిన సాక్ష్యాధారాలు లేవంటూ కేసు కొట్టి వేసింది.
 • ఆ తీర్పును అలహా బాద్‌ హైకోర్టు 2010, మే 20న సమర్థించింది. దీన్ని సీబీఐ 2011 ఫిబ్రవరి 18న సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది.
 • 2002లో అయోధ్య వెళ్లి వస్తున్న కరసేవకుల రైలుపై దాడి చేశారు. దానిని తగుల బెట్టారు.
 • ఈ ఘటనలో 58 మంది హిందువులు చనిపోయారు. దీనికి ప్రతిగా గోద్రా అల్లర్లు జరిగాయి. అందులోను వందలాది మంది ముస్లింలు చనిపోయారు.
 • హైకోర్టు 2002 నుంచి వాదనలు వినడం ప్రారంభించింది.
 • తాజాగా సుప్రీంకోర్టుకు అప్పీల్ కు వెళ్లడంతో కుట్ర అభియోగాలను పునరుద్ధరించింది.

Don't Miss