తెలంగాణలో సరికొత్త రాజకీయ సమీకరణ..

21:10 - January 11, 2018

హైదరాబాద్ : తెలంగాణలో.. సరికొత్త రాజకీయ ఫ్రంట్‌ ఆవిర్భవించబోతోంది. బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్‌లకు ప్రత్యామ్నాయంగా ఈ ఫ్రంట్‌ ఏర్పడుతోంది. బహుజన లెఫ్ట్‌ ప్రంట్ పేరిట ఈనెల 25న మొదలయ్యే ప్రత్యామ్నాయ రాజకీయ వేదికకు.. అధ్యక్షుడిగా నల్లా సూర్యప్రకాశ్‌, కన్వీనర్‌గా తమ్మినేని వీరభద్రం వ్యవహరిస్తారు. తెలంగాణ రాజకీయాల్లో.. సరికొత్త ఐక్య వేదిక పురుడుపోసుకోనుంది. ఈనెల 25న బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ పేరిట ఈ ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఆవిర్భవించనుంది. జ్యోతిరావు ఫూలే, అంబేడ్కర్‌ తరహా విధానాలు, ఆలోచనలతో ఏర్పాటు కానున్న ఈ ప్రత్యామ్నాయ ఫ్రంట్‌లో చేరేందుకు.. ఇప్పటికే 28 రాజకీయ పార్టీలు అంగీకరించాయి. వనస్థలిపురంలో జరిగే ఫ్రంట్‌ ఆవిర్భావ సభకు, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, అంబేడ్కర్‌ మనవడు ప్రకాశ్‌ అంబేడ్కర్‌ హాజరు కానున్నారు.

గురువారం, సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సన్నాహక భేటీలో.. బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ అధ్యక్షుడిగా నల్లా సూర్య ప్రకాష్, కన్వీనర్‌గా తమ్మినేని వీరభద్రం ఎన్నికయ్యారు. రాజ్యాధికార సాధనే లక్ష్యంగా.. తెలంగాణలోని 119 స్థానాల్లోనూ పోటీ చేయాలని బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ భావిస్తోంది. జనాభాలో 93శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమమే ధ్యేయంగా, సామాజిక న్యాయ సాధనే లక్ష్యంగా ఫ్రంట్ పని చేయనుంది. ప్రత్యేక రాష్ట్రం సిద్ధించినా తెలంగాణ ప్రజల జీవన స్థితి గతుల్లో మార్పులు రాలేదని, అందుకే, ప్రత్యామ్నాయ అభివృద్ది నమూనాతో ప్రజల్లోకి వెళ్లాలని ఫ్రంట్‌ నిర్ణయించింది.

రాష్ట్రంలో నూతన రాజకీయ నాయకత్వం అవసరం ఎంతగానో ఉందని.. బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ విశ్వసిస్తోంది. ఆ దిశగా.. వామపక్ష భావజాలమున్న పార్టీలన్నింటినీ కలుపుకు పోవాలని ఫ్రంట్‌ నేతలు భావిస్తున్నారు. బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ అధికారంలోకి వస్తే.. సామాజిక న్యాయ సాధనకు పెద్దపీట వేయాలని తీర్మానించారు.

ప్రజా పోరాటాల ఫలితంగా భౌగోళిక తెలంగాణ సాధించినప్పటికీ.. ప్రజలు ఆశించిన రీతిలో పాలన సాగడం లేదని.. బహుజన ఫ్రంట్‌ రూపకర్తలు భావిస్తున్నారు. ఈనెల 25న బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ ఆవిర్భావం సందర్భంగా.. వనస్థలిపురంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని ఫ్రంట్‌ నేతలు నిర్ణయించారు. అందులో.. ప్రత్యామ్నాయ రాజకీయ ముసాయిదాతో ప్రజల్లోకి వెళ్లేలా కార్యాచరణ రూపొందించనున్నారు. 

Don't Miss