వనపర్తి వాసికి 'బాలాపూర్ లడ్డూ'...

06:27 - September 6, 2017

హైదరాబాద్ : ఎంతో ప్రతిష్టాత్మకమైన బాలాపూర్‌ లడ్డూ.. ఈసారి 15 లక్షల 60 వేలు పలికింది. గతేడాది కంటే ఈసారి అధికంగా 95 వేలు పెరిగింది. చివరి వరకు ఎంతో పోటాపోటీగా సాగిన ఈ వేలం పాటలో... వనపర్తికి చెందిన నాగం తిరుపతిరెడ్డి బాలాపూర్‌ లడ్డూను దక్కించుకున్నాడు. హైదరాబాద్‌ గణేశ్‌ ఉత్సవాలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచి... ఏటేటా భక్తుల్లో ఆసక్తిని రేకెత్తించే గణనాథుడు బాలాపూర్‌ గణేశుడు. ప్రతి ఏటా బాలాపూర్‌ లడ్డూ వేలం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. అందుకే ఈ లడ్డూను దక్కించుకునేందుకు అందరూ ఆసక్తి కనబరుస్తుంటారు. ఈసారి లడ్డూ వేలం పాటలో 22 మంది పాల్గొన్నారు. ఈ వేలం పాటను తిలకించేందుకు భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు.

లడ్డూ వేలం పాట చివరి వరకు ఎంతో ఉత్కంఠగా కొనసాగింది. ఈసారి నాగం తిరుపతిరెడ్డి అనే వ్యక్తి 15 లక్షల 60 వేల రూపాయలకు బాలాపూర్‌ లడ్డూను దక్కించుకున్నాడు. గతేడాది కంటే ఈసారి బాలాపూర్‌ లడ్డూ 95 వేలు అధికంగా పలికింది. ఈ వేలంపాట నాగం తిరుపతిరెడ్డి, నాగార్జున మహేందర్‌రెడ్డి మధ్య కొనసాగింది. ఎంతో ప్రతిష్టాత్మకమైన లడ్డూను దక్కించుకున్న నాగం తిరుపతిరెడ్డి ప్రస్తుతం జూబ్లీహిల్స్‌ ఉంటుండగా.. ఆయన వనపర్తి జిల్లా గోపాలపేట మండలం నాగపూర్‌కు చెందినవాడు. వేలంపాటలో లడ్డూ దక్కించుకున్న తిరుపతిరెడ్డిని గణేశ్‌ ఉత్సవ కమిటీ సభ్యులు సత్కరించారు.

బాలాపూర్‌ లడ్డూను దక్కించుకున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నాడు నాగం తిరుపతిరెడ్డి. లడ్డూ వేలం పాటకు సహకరించిన ప్రతి ఒక్కరికి తిరుపతిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. బాలాపూర్‌ లడ్డూ దక్కించుకుంటే సిరిసంపదలు దక్కుతాయని భక్తుల విశ్వాసం. దీంతో ప్రతి యేడాది ఈ లడ్డూ వేలానికి క్రేజ్‌ పెరిగింది. ప్రతి ఏడాది వినాయక నిమజ్జనం రోజు ప్రతి ఒక్కరి చూపు బాలాపూర్‌ లడ్డూ వేలంపైనే ఉంటుంది. ఇందుకోసం స్థానికులతో పాటు... ఇతర ప్రాంతాల నుంచి తరలివస్తుంటారు. అంతేకాకుండా... ఎన్‌ఆర్‌ఐలు కూడా ఈ వేలంలో పాల్గొంటారు. 23 ఏళ్లుగా లడ్డూ కొనసాగుతున్న లడ్డూ వేలం పాటలో... లంబోదరుడి చేతిలో ఉన్న లడ్డూను తాకితే చాలు సకల శుభాలు కలుగుతాయని పలువురు భావిస్తుంటారు. 1994లో ప్రారంభమైన ఈ వేలం ఇప్పటివరకు నిరాటంకంగా కొనసాగుతోంది. 94లో 450 రూపాయలు పలికిన లడ్డూ... ఇప్పుడు 15 లక్షల 60 వేలకు చేరింది.

ఇక వేలం పాట ద్వారా వచ్చిన డబ్బును గ్రామాభివృద్ధికి ఉపయోగిస్తుంటారు. ఇప్పటివరకు వివిధ అభివృద్ధి పనులకు 39 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు గణేష్‌ ఉత్సవ సమితి సభ్యులు తెలిపారు. ఇక ఈ వేలంపాటలో కులమతాలకు అతీతంగా.. రాజకీయ విభేదాలు వీడి వేలంపాటలో పాల్గొంటామని గ్రామస్తులంటున్నారు. గ్రామ శ్రేయస్సును కాంక్షిస్తూ ప్రతి ఏటా భక్తి శ్రద్ధలతో వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తుండడంతో బాలాపూర్‌ గణేశుడి వేలంపాట... ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. 

Don't Miss