బోంగులో చికెన్ కు బ్రేక్

19:03 - November 1, 2017

తూర్పుగోదావరి : జిల్లా మారేడుమిల్లి ప్రాంతంలో బొంగులో చికెన్‌ ప్రస్థానం ప్రారంభమైంది. ఈ ప్రాంతంలోకి వెళ్లగానే బ్యాంబూ చికెన్‌ రారమ్మని పిలుస్తుంది. తన రుచి చూడమని ఆహ్వానిస్తుంది. ఒకసారి రుచిచూస్తే... పదేపదే దానికోసం ఎగబడేలా చేస్తుంది. దశాబ్దంన్నర నుంచి బ్యాంబూ చికెన్‌ వంటకం బాగా ప్రచారం సాధించింది. ఆయిల్‌ వినియోగం లేకుండా వెదురు బొంగులో చికెన్‌ వేసి మంటపై కాల్చి తినడంతో వచ్చే ప్రత్యేక రుచి భోజన ప్రియులను ఆకట్టుకుంటుంది. ఒకప్పుడు గిరిజనుల ప్రయోగాలతో వచ్చిన బొంగులో చికెన్‌.. ఇప్పుడు చాలా మందికి అది వ్యాపారంగా మారింది. ఏజెన్సీలోని పలు పర్యాటక ప్రాంతాల్లో బొంగు చికెన్‌ అమ్మకాలను గిరిజనేతరులు భారీ స్థాయిలో కొనసాగిస్తున్నారు. బాగా లాభాలు కూడా ఆర్జిస్తున్నారు. బొంగు చికెన్‌ తయారీ కోసం అవసరమైన వెదురు బొంగులను అడవుల నుంచి నరికి తీసుకురావడం ఈ మధ్య బాగా పెరిగింది. ఒకసారి కాల్చేస్తే బొంగు ఇక పనికిరాదు. మరోసారి వండాలంటే మరో వెదురు బొంగు అనివార్యం అవుతుంది. దీంతో అడవుల్లో వెదురు బొంగులను నరికి తీసుకొచ్చి మరీ బ్యాంబూ చికెన్‌ వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. వెదురు చెట్ల నరికివేతతో అటవీ సంపదకు సమస్యలు వస్తున్నాయని అటవీ అధికారులు భావిస్తున్నారు. దీంతో వెదురు బొంగుల నరికివేతపై ఆంక్షలు విధించారు.

వెదురు బొంగుమీద ఆంక్షాలు
వెదురు బొంగుమీద ఆంక్షలతో బ్యాంబూ చికెన్‌ తయారీ నిలిపోయింది. దీంతో పర్యాటకులు నిరాశచెందాల్సి వస్తోంది. దీంతో బొంగు చికెన్‌పై ఆంక్షలు విధించడం సరికాదని టూరిస్టులు అంటున్నారు. గిరిజనులకు వెదురు బొంగులు తీసుకొచ్చుకునే అవకాశం లేకుండా ప్రభుత్వం చేస్తోందని గిరిజన నాయకులు మండిపడుతున్నారు. వెదురు బొంగులపై విధించిన ఆంక్షలను తొలగించాలని కోరుతున్నారు. తద్వారా గిరిజనులకు ఉపాధి కల్పించినట్టవుతుందని చెప్తున్నారు. ఫారెస్ట్‌ అధికారులు ఇప్పటికైనా స్పందించి వెదురు బొంగులపై విధించిన ఆంక్షలను వెంటనే తొలగించాలని గిరిజనులు కోరుతున్నారు. తమ ఉపాధిగా మారిన బ్యాంబూ చికెన్‌కు బ్రేక్‌ వేసేలా చర్యలు తీసుకోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెదురు చెట్ల నరికివేతపై ఆంక్షలు తొలగించి తమ ఉపాధికి సహకరించాలని కోరుతున్నారు.

Don't Miss