తెలంగాణ అస్తిత్వ వైభవం బతుకమ్మ

20:14 - September 21, 2017

బతుకుకు స్ఫూర్తినిచ్చిన సంబురం. తీరొక్క పూలు, కోటొక్క పాటల కోలాహలం. తెలంగాణ అస్తిత్వ వైభవం. ఆడపడుచుల ఆరాధ్య వైభోగం. ప్రకృతి రమణీయత. శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతీక. తెలంగాణలో బతుకమ్మ సంబరం మొదలైంది. ఎంగిలి పూల వేడుకతో ఆరంభమైంది. అసలు బతుకమ్మ తెలంగాణకు ఎలాఅస్తిత్వమైంది...ఆడపడుచులతో ఎలా మమేకమైంది...బతుకమ్మ ఇచ్చే బతుకు సందేశమేంటి. బతుకమ్మ పూలతో చేసే జాతర. అందాల హరివిల్లును నేలమీద పరిచే వేడుక . కంచెలు కంచెలుగా, బీళ్లు బీళ్లుగా విస్తరించుకున్న తెలంగాణలో కన్నీటి చెలిమె బతుకమ్మ. ఉయ్యాలలూపే పాటల పల్లవుల్లో ఆడపడుచుల ఆర్భాటపు పండగ బతుకమ్మ. తెలంగాణ ఊరూవాడా బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి.

బతుకమ్మపై అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. అవన్నీ పక్కనపెడితే బతుకమ్మ అంటే ప్రకృతితో పెనవేసుకున్న మానవీయ బంధం. సమతా మమతల సారం. ఒక నవ్యనూతన సామాజిక చైతన్యం. ప్రకృతితో బతుకమ్మ ఎలా మమేకమైంది...దేనికీ పనికి రాని పూలకు బతుకమ్మ ఉత్సవం ఎలా విలువనిచ్చింది...బతుకమ్మ అంటే మూర్తీభవించిన మహిళ. చెరువుల రక్షణ కోసం ప్రాణార్పణకు వెరవని మగువ. సామాజిక చైతన్య తెగువ. దశాబ్దాల బతుకమ్మ ఉత్సవం స్త్రీలతో ఎలా పెనవేసుకుంది..?బతుకమ్మ చుట్టూ రాజకీయం ఎందుకు ముసురుకుంటోంది...బతుకమ్మ ఉత్సవం కొందరికే సొంతమైనట్టు ప్రచారమెందుకు...బతుకమ్మ అస్తిత్వమైన తెలంగాణలో బతుకుమ్మలను ఎందుకు చిదిమేస్తున్నారు...మహిళా సంఘాలు సంధిస్తున్న ప్రశ్నలివి. బతుకు కోసం, బతుకు భద్రత కోసం బతుకమ్మ కావాలి. గడీల బతుకమ్మ కాదు బడుగుల బతుకమ్మ ఆడుదాం. మహిళలపై హింసలేని తెలంగాణ కోసం పోరాడుదాం.

బతుకమ్మ పండుగలో మూడు ప్రధానమైన అంశాలు. ఒకటి ఆడబిడ్డలు, రెండు చెరువు, మూడు పూలు. చెరువులో పూలను వదలడం అనేది ఒక్కొక్కరు ఒక్కో రకంగా అర్థం చేసుకున్నా అన్నింటికీ మించి చెరువు కోసం ప్రాణత్యాగాలు చేసిన వారికి పూలనివాళి బతుకమ్మ. చారిత్రక కథనాలు ఎలా ఉన్నా తెలంగాణకు సజీవ అస్తిత్వం బతుకమ్మ. కోటి రతనాల తెలంగాణాకు ఒక పూల తోరణం. తొమ్మిదిరోజుల పాటు ఈ పూలవనం ప్రతి ముంగిటా అందంగా కనిపిస్తుంది. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

Don't Miss