సీజనల్ వ్యాధులు.. తస్మాత్

10:54 - June 24, 2017

విపరీతమైన ఎండల తర్వాత వచ్చే వర్షాకాలం శరీరానికీ, మనసుకీ ఎంతో హాయిగా ఉంటుంది. తొలకరి జల్లు చిందికే మట్టివాసన అనిర్వచనీయమైన ఆనందాన్ని కలుగజేస్తుంది. ఈ ఆనందాన్ని పూర్తిగా పొందాలంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా ఎంతో అవసరం. వర్షాకాలం, శీతాకాలం, ఎండాకాలం ఇలా సీజన్‌ ఏదైనా ప్రజల్ని పలు రకాల వ్యాధులు చుట్టుముడుతూనే ఉంటాయి. సహజంగానే సీజన్‌ మారినప్పుడు జలుబు, దగ్గు, తుమ్ములు, వాంతులు, నీళ్ల విరేచనాలు, టైఫాయిడ్‌, మలేరియా, డెంగ్యు, మెదడువాపు లాంటి వ్యాధులు సంభవిస్తాయి. ఇవన్నీ కూడా నీరు కలుషితం కావడం కారణంగానే సంభవిస్తాయన్నది యదార్థం. నిల్వ ఉన్న నీటిలో బ్యాక్టీరియా, ఫంగస్‌ వ్యాప్తి చెందుతాయి. అందుకని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఈగలు వాలిన ఆహార పదార్థాలను, శీతల పానీయాలను తీసుకోకూదని వైద్యులు చెప్తున్నారు. నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు తీసుకోకపోవడం చాలా మందిచింది. దోమకాటు వల్ల డెంగ్యూ, మలేరియా, ఫైలేరియా, మెదడువాపు వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు పాటించాలి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

ఆహారం తీసుకునే ముందు, మల విసర్జన చేసిన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి.

వేడి ఆహార పదార్థాలను మాత్రమే తినాలి.

ఇంటి చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

క్లోరినేషన్‌ చేసిన నీటినే తీసుకోవాలి.

కాచి వడబోసిన నీటినే తాగాలి.

డయేరియా వ్యాధి బారిన పడిన వారికి రోజుకు వీలైనంత ఎక్కువగా నీళ్లు తాగించాలి.

శుభ్రమైన చోట మాత్రమే మంచినీటిని పెట్టాలి. అలాగే నీటిపై మూత పెట్టడం మరవొద్దు.

మంచినీరు ఉంచిన చోట స్నానం చేయడం, బట్టలు ఉతకడం చేయొద్దు.

కాయగూరలు, పండ్లను శుభ్రంగా కడగాలి.

సాధ్యమైనంత వరకు అప్పుడే వండిన ఆహారాన్ని తీసుకోవాలి.

రాత్రి పూట నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు, ముఖ్యంగా మాంసాన్ని తినొద్దు.

భోజనం చేసే సమయంలో చేతులను సబ్బుతో కడుక్కోవాలి.

ఆహార పదార్థాలపై ఈగలు వాలకుండా మూత పెట్టాలి.

Don't Miss