పెరుగుతో అందం...

13:14 - October 21, 2018

హైదరాబాద్ : పెరుగు లేకుండా భోజనం ఊహిచుకుంటారా ? ఎన్ని ఆహార పదార్థాలు పెట్టినా పెరుగు ఉండాల్సిందే. భోజనం చివరలో ఒక ముద్ద పెరుగన్నం తింటే ఆరోగ్య సమస్యలు దగ్గరకి రావని వైద్యులు పేర్కొంటుంటారు. ప్రతి రోజూ మనం తీసుకునే ఆహారంలో పెరుగు దివ్యౌషధంలా పనిచేస్తుంది. ఈ పెరుగును అందానికి కూడా ఉపయోగించుకోవచ్చు. పెరుగుతో అందాన్ని మెరుగుపరచుకోవచ్చు. మొటిమలు..ఇతరత్రా సమస్యలు తీరుతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ముఖాన్ని తాజాగా మార్చుతుంది. పెరుగులో రోజ్ వాటర్ కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. కొద్దిసేపటి అనంతరం చల్లటి నీటితో ముఖానికి కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు, నల్లటి మచ్చలు తొలగిపోయి కాంతివంతంగా మారుతుంది. శెనగపిండిలో కొద్దిగా నిమ్మరసం, రోజ్ వాటర్ కలుపుకుని ముఖానికి ప్యాక్ మాదిరిగా వేసుకోవాలి. అరగంట తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వలన ముఖంపై గల నల్లటి మచ్చలు తొలగిపోతాయి. దాంతో ముఖం మృదువుగా, తాజాగా మారుతుంది.
పెరుగు చర్మానికి సహజసిద్ధమైన క్లెన్సర్‌లా పనిచేస్తుంది. దీనికి చెంచా చొప్పున సెనగపిండి, పెసరపిండి, తేనె కలిపి ఒంటికి పట్టించి నలుగులా రుద్దుకోవాలి. అప్పుడే దుమ్ము, ధూళితో పాటు మృతకణాలు తొలగిపోయి నునుపుదనం మీ సొంతమవుతుంది. పెరుగులో తమలపాకుని కొద్దిసేపు నానబెట్టి ఆ తర్వాత కళ్లపై ఉంచుకుంటే వేడి హరించుకుపోయి తాజాగా కనిపిస్తాయి. పావుకప్పు పెరుగులో అంతే పరిమాణంలో కలబంద గుజ్జు, చెంచా సెనగపిండి, నిమ్మరసం, అరచెంచా బాదం నూనె కలిపి మెత్తగా చేసుకొని ముఖానికి పూతలా వేయాలి. ఇలా ఓ ఇరవై నిమిషాల పాటు ఉంచుకొని అరాక గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే ముఖం కాంతివంతమవడం ఖాయం.

Don't Miss