పక్కా ప్లాన్‌తో నే దోచేశారు

06:53 - December 29, 2016

సంగారెడ్డి : మళ్లీ ముత్తూట్‌ ఫైనాన్స్‌లో భారీ లూటీ జరిగింది...ఇది జరగడం రెండోసారి... సంగారెడ్డి జిల్లాలో జరిగిన భారీ చోరీ కలకలం రేపుతోంది..సీబీఐ ఆఫీసర్లమంటూ వచ్చి తనిఖీలు చేస్తున్నట్లు చేస్తూనే లాకర్లలో కిలోల కొద్దీ బంగారాన్ని దోచుకెళ్లారు... అడ్డుకున్న సిబ్బందిపై మారణాయుధాలు గురిపెట్టి బెదిరించారు.. ఐదుగురు ఐదు నిమిషాల్లోనే మొత్తం లూటీ చేసి వెళ్లడం వెనక ఉన్న గ్యాంగ్‌ ఎక్కడిది..???

క్షణాల్లో పనిపూర్తి చేసిన దుండగులు .....

సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని ముత్తూట్‌ ఫైనాన్స్‌లో భారీ ఎత్తున లూటీ జరిగింది...అంతా క్షణాల్లో పనిపూర్తి చేసిన దుండగులు కిలోల కొద్దీ బంగారాన్ని ఎత్తుకెళ్లారు...ముత్తూట్‌ ఫైనాన్స్‌ కార్యాలయంలోకి ఐదుగురు వస్తూనే సీబీఐ ఆఫీసర్స్‌ మంటూ చెప్పారు..దీంతో ఒక్కసారి ఖంగుతిన్న కార్యాలయం సిబ్బంది వారు చెప్పినట్లు రికార్డులు చూపించారు..ఆ తర్వాత లాకర్లు ఓపెన్ చేయాలన్నారు...అందుకు వారు నిరాకరిస్తే అదిరించారు.. సీబీఐ వస్తే చూపించరా అంటూ హుంకరించడంతో వెంటనే లాకర్లను తెరిచారు...

తనిఖీలు చేస్తున్నట్లుగా డ్రామా..

లాకర్లు తెరిచి బంగారాన్ని సంచుల్లో వేసుకుంటుండటాన్ని సిబ్బంది గమనించి ప్రశ్నించారు. దీంతో ఆయుధాలతో వారిని బెదిరించి బాత్‌రూమ్‌లోకి నెట్టి గడియపెట్టారు. అనంతరం లాకర్లలో ఉన్న 46 కిలోల బంగారాన్ని సంచుల్లో నింపుకుని అక్కడి నుంచి పరారయ్యారు...దుండగులు వెళ్తూ వెళ్తూ తమ జాడ తెలియకుండా తెలివిగా కార్యాలయంలోని సీసీ కెమెరా పుటేజీని కూడా తమ వెంట తీసుకెళ్లారు...

దోపిడీకి గురైన బంగారం విలువ 12కోట్లు....

సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆధారాలు సేకరించారు. ఘటన జరిగిన తీరును సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు....దోపిడీకి గురైన బంగారం విలువ 12కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు..భారీగా లూటీ చేసిన గ్యాంగ్‌ ఆచూకీ తెలుసుకునేందుకు నగరంలోని ప్రతీ చోటా ఉన్న సీసీ ఫుటేజీలను తీసుకుని పరిశీలిస్తున్నారు...చాకచక్యంగా వచ్చిన వారు దోచుకుని పోయిన తీరుచూసి సిబ్బంది తేరుకోలేకపోతున్నారు..గతంలో కూడా ఇలానే దోపిడీ జరిగింది.. రెండో సారి జరగడం వెనక అసలు కథేంటో అర్థం కాని పరిస్థితి నెలకొంది...

పోలీసుల తనిఖీలు ముమ్మరం ......

ముత్తూట్‌ ఫైనాన్స్‌లో దోపిడీకి పాల్పడిన దుండగులను పట్టుకునేందుకు పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. జహీరాబాద్‌తో పాటు తెలంగాణ-కర్ణాటక సరిహద్దు కూడలి గంగ్వార్‌ వద్ద అంతర్రాష్ట్ర రాకపోకలు సాగిస్తున్న వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. హైదరాబాద్‌-ముంబయి, బీదర్‌-జహీరాబాద్‌ మార్గంలో సోదాలు నిర్వహిస్తున్నారు...అయితే ఈ దోపిడీ చేసింది లోకల్ గ్యాంగ్ కాదని...పొరుగు రాష్ట్రం నుంచి వచ్చినట్లు అనుమానిస్తు ఆయా రాష్ట్రాల పోలీసుల సహకారం కోసం సమాచారం అందించారు,...

Don't Miss