సమరానికి సై అంటున్న పందెం కోళ్లు

11:57 - January 11, 2017

విజయవాడ : సంక్రాంతి అంటే.. ముందుగా గుర్తొచ్చేది కోడి పందేలు. ఏళ్ల తరబడి కోళ్లకు మాంచి పౌష్టికాహారాన్ని అందిస్తూ.. కోడి పందేలకు సిద్ధం చేస్తుంటారు పందెం రాయుళ్లు. జీడిపప్పు, బాదం, పిస్తాలను లాగించి దట్టంగా తయారైన కోళ్లు బరిలో దిగి పందెం రాయుళ్లకు కాసుల పంట పండిస్తుంటాయి. ఈ  సంక్రాంతికి కూడా పందెంలో ఢీకొట్టేందుకు సిద్థంగా ఉన్నాయి పందెం కోళ్లు. కోళ్ల పందేలకు పెట్టింది పేరైన గోదావరి జిల్లాలతో పాటు ఏపీ నవ్యాంధ్ర రాజధాని ప్రాంతాలు కోడి పందాల నిర్వహణకు సన్నాహామవుతున్నాయి. 
కోళ్లను సిద్ధం చేస్తున్న పందెం రాయుళ్లు 
సంక్రాంతి అంటే కోడి పందాలు.. కోడి పందాలంటే సంక్రాంతి అనేలా మారిపోయింది. ఈ సారి కూడా సంక్రాంతికి కోడిపందాల సన్నాహాలు జోరుగా జరుగుతున్నాయి. తెలుగు వారి సంస్కృతి, సాంప్రదాయాలకు నిలువుటద్దంగా నిలిచేలా ప్రతిఏటా కోళ్ల పందాలు జరుగుతూనే ఉంటాయి. ఈసారి కూడా జోరుగా కోళ్ల పందాలు నిర్వహించేందుకు పందెం రాయుళ్లు సిద్ధమవుతున్నారు.
తెలుగునాట పందాలు 
తెలుగునాట పందాలు అంటే కోడి పుంజులదే హవా. ఎప్పటిలాగే ఈసారి కూడా కోళ్లు బరిలో కాలు దువ్వేందుకు సిద్ధమవుతున్నాయి. తనను పెంచి.. పోషించిన యజమాని పేరు నిలబెట్టాలంటే కోడి పోరు పరువు లోనే సాధ్యమన్నట్లు కాలుదువ్వేందుకు సిద్ధంగా ఉన్నాయి. పందెపు రాయుళ్లు ఇప్పటికే చెరకు, అరటి, మామిడి తోటల్లో కోడి పందాలు నిర్వహించేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు. మరికొందరైతే.. ఎక్కడ ఖాళీ స్థలం దొరికితే అక్కడ టెంట్లు వేసి మరీ కోడి పందాలు నిర్వహిస్తున్నారు.  
పందెపు కోళ్లు... లక్షల్లో కొనగోలు  
సెలవు దినాలు కావడంతో  రేంజ్‌ ఏ మాత్రం తగ్గకుండా ఖరీదైన కార్లు, బైక్ ల మీద తరలివస్తున్నారు. ఇందుకోసం భారీ ఎత్తున డబ్బును కూడగట్టి బరులు సిద్ధం చేస్తున్నారు. సాంప్రదాయకంగా సాగుతున్న పందెపు కోళ్లను లక్షలు వెచ్చించి కొనుగోలు చేసి కోడి పందాలకు తెగబడుతున్నారు. 
కోళ్ల పందాలు నిర్వహణకు రంగం సిద్ధం 
విజయవాడ సమీపంలోని గన్నవరం, పెనమలూరు, కృష్ణాజిల్లాలోని ఉయ్యూరు, దివిసీమ, నాగాయలంక, నూజివీడు,  తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ ఎత్తున కోళ్ల పందాలు నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఈ పందాల్లో కోట్లాది రూపాయలు చేతులు మారనున్నాయి. కొందరు ప్రజాప్రతినిధులు, ఆయా శాఖలకు చెందిన ఉన్నతస్థాయి అధికారులు, సిబ్బంది, అనుచరులు దగ్గరుండి పందెపు కోడికి కత్తులు కట్టించి బరిలో దింపేలా సన్నద్ధం అవుతున్నారు.  
బహిరంగ కోడి పందాల నిర్వహించేలా చర్యలు 
ఈ ఏడాది కొందరు ప్రజాప్రతినిధులు దగ్గరుండి బహిరంగంగానే కోడి పందాల నిర్వహించేలా చర్యలు చేపట్టారు. తమ పేరు మాత్రం బయటకు రాకుండా గోప్యత పాటిస్తూ.. కోడిపందాలకు భారీ ఎత్తున డబ్బులు ఖర్చు చేసేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా తోటల్లో నిర్వహించే కోడి పందాలకు సకల ఏర్పాట్లు జరుగుతున్నా.. వాటిపై ఎలాంటి దాడులు కూడా చేయడం లేదు.  కోడిపందాలపై తహసీల్దార్‌, ఎస్సై సంయక్తంగా కమిటీగా ఏర్పడి నివేదిక ఇవ్వాలని హైకోర్టు కోరగా.. ఆ రెండు శాఖలు మాత్రమే స్పందిస్తున్నాయి. 

 

Don't Miss