తూతూ మంత్రంగా ప్రజాభిప్రాయ సేకరణ

09:29 - January 12, 2017

విజయనగరం : భోగాపురం గ్రీన్‌ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణంపై జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ రసాభాసగా ముగిసింది. ఎయిర్ పోర్టు వ్యతిరేక పోరాట ఉద్యమ నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ ఎయిర్‌ పోర్టు ప్రభావిత గ్రామ ప్రజలు సభను బహిష్కరించారు. దీంతో అధికారులు ఉన్న కొద్దిమందితోనే ప్రజాభిప్రాయ సేకరణ తూతూ మంత్రంగా ముగించి చేతులు దులుపుకున్నారు. 
బాధిత గ్రామాల నుంచి నిరసన 
అరెస్టులు, నిరసనలు, పోలీసుల నిర్బంధం నడుమ విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణం కోసం ప్రజాభిప్రాయ సేకరణ తూతూమంత్రంగా ముగిసింది. ప్రజాభిప్రాయ సేకరణలో బాధిత గ్రామాల ప్రజల నుంచి నిరసన వ్యక్తమయ్యే అవకాశాలున్న నేపథ్యంలో ముందస్తుగా ఎక్కడికక్కడ పోలీసులు భారీగా మోహరించారు. సభకు వెళ్లే అన్ని కూడళ్ల వద్ద భారీగా పోలీసులను పెట్టి, తనిఖీలు నిర్వహించారు. కేవలం బాధిత గ్రామాలు, సామాన్య ప్రజలు తప్పా నేతలెవర్నీ అటువైపు వెళ్లనీయకుండా కట్టుదిట్టం చేశారు. 
ప్రజాభిప్రాయ సేకరణకు చాటేసిన ముఖం ప్రజలు    
జిల్లా కలెక్టర్ అధ్యక్షత జరిగిన ప్రజాభిప్రాయ సేకరణకు బాధిత గ్రామాల ప్రజలు ముఖం చాటేశారు. అభిప్రాయ సేకరణకు ఒక  రోజు ముందుగానే ఉద్యమ నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. సభా ప్రాంగణానికి వెళ్లే రహదారులన్నీ పోలీసుల కనుసన్ననలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడంతో బాధిత గ్రామాల ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయితే పోలీసుల నిర్బంధాన్ని తప్పించుకొని సభా ప్రాంగణం వద్దకు  చేరుకున్న వామపక్ష నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై వాపపక్ష నేతలు మండిపడ్డారు. 
ప్రజలు తీవ్ర ఆగ్రహం
దీనిపై సభకు హాజరైన ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తమ తరపున మాట్లాడే నేతలను అరెస్టు చేయడమేంటని నిరసిస్తూ సభకు హాజరైనవారంతా బయటకు వచ్చేశారు. బయటకు వచ్చిన ప్రజలంతా వేదికకు కొంత దూరంలో ర్యాలీ నిర్వహించి తమ నిరసన తెలిపారు. దీంతో అధికారులు చేసేది లేక ఉన్న కొద్ది మందితోనే సభను కొనసాగించారు. బాధిత గ్రామాలకు చెందిన కొంత మంది కొన్ని అభ్యంతరాలను లేవనెత్తినప్పటికీ అధికారులు వాటికి ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. ఏయిర్‌ పోర్టు కు భూములిచ్చిన వారికి తగిన న్యాయం చేస్తామని జిల్లా కలెక్టర్‌ వివేక్ యాదవ్ హామీ ఇచ్చారు. మొత్తం మీద పోలీసుల నిర్భంధంతో బాధిత గ్రామాల ప్రజల గొంతునొక్కి ఎయిర్ పోర్టు ప్రజాభిప్రాయ సేకరణను అధికారులు ముగించేశారు. 

 

Don't Miss