బ్యాంకులకు సెలవులు.. ప్రజలకు కష్టాలు..

21:51 - November 26, 2016

హైదరాబాద్ : మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా తయారైంది ప్రజల పరిస్థితి. కరెన్సీ లేక 18 రోజులుగా ఇబ్బందులు పడుతుంటే.. తాజాగా బ్యాంకులకు వచ్చిన సెలవులు.. ఆ కష్టాలను మరింత రెట్టింపు చేస్తున్నాయి. డబ్బులు తీసుకునేందుకు ఏటీఎంలు ఒక్కటే మార్గం కావడంతో ప్రజలు ఉదయం నుంచే ఏటీఎంల వద్ద బారులు తీరారు. మరోవైపు ఏటీఎంల నుంచి రెండు వేలు మాత్రమే డ్రా చేసుకునే అవకాశం ఉండడంతో గండం ఎలా గడుస్తుందోనన్న టెన్షన్‌ అందరినీ వెంటాడుతోంది. 
18 రోజులు గడుస్తున్నా....
నోట్లు రద్దు చేసి 18 రోజులు గడుస్తున్నా ప్రజల కష్టాలు తీరడం లేదు. మరోవైపు బ్యాంకులకు రెండు రోజులు సెలవులు రావడంతో ప్రజల కష్టాలు మరింత రెట్టింపు అయ్యాయి. నగదు తీసుకునేందుకు ఏటీఎంలు ఒక్కటే దిక్కయ్యాయి. దీంతో ప్రజలంతా ఏటీఎం వద్ద బారులు తీరారు. రద్దీ పెరగడంతో.... గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సిన పరిస్థితి ఉంది. దీంతో అందరికీ క్యాష్‌ అందని పరిస్థితి నెలకొంది. చాలా చోట్ల క్యూలైన్లలో నిలబడ్డవారు నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఇక ఏటీఎంలలో 2 వేల నోటు మాత్రమే వస్తుండడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వెలవెలబోతున్న వ్యాపారాలు
మరోవైపు చిల్లర కష్టాలతో వ్యాపారాలన్నీ వెలవెలబోతున్నాయి. మార్కెట్‌కు వచ్చే వాళ్లంతా రెండు వేల నోట్లు తెస్తుండడంతో చిల్లర ఇవ్వలేకపోతున్నామని వ్యాపారులంటున్నారు. ఏటీఎంలలో చిల్లర నోట్లు కూడా పెడితే బాగుంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఏటీఎంల దగ్గరకు భారీగా ప్రజలు వస్తుండడంతో ఏటీఎంలు కూడా మొరాయిస్తున్నాయని.. దీంతో ఇబ్బందులు తీవ్రమవుతున్నాయని ప్రజలంటున్నారు. ఇక ఈరోజు బ్యాంకులకు సెలవు అని తెలియక చాలా ప్రాంతాలలో ప్రజలు బ్యాంకుల వద్ద బారులు తీరారు. తీరా విషయం తెలుసుకుని నిరాశగా వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
ప్రజలకు కాంగ్రెస్‌ అండ 
ఇక సిద్దిపేటలో ఏటీఎం కేంద్రాల వద్ద గంటల తరబడి నిలబడి అవస్థలు పడుతున్న ప్రజలకు కాంగ్రెస్‌ అండగా నిలిచింది. క్యూలైన్లలో నిలబడ్డవారికి వాటర్‌ బాటిళ్లు, బిస్కెట్‌ ప్యాకెట్లు అందజేశారు. మోదీ తీసుకున్న నిర్ణయంతో పేదలు అనేక ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి బ్యాంకులకు సెలవు కారణంగా ప్రజలకు మరో రెండు రోజులు ఇబ్బందులు తప్పేటట్లు లేదు. 

 

Don't Miss