కృష్ణ రాజకీయ సన్యాసంతో బీజేపీపై ఎఫెక్ట్ ?..

16:46 - October 5, 2018

కర్ణాటక : అనేక సార్లు ఎంపీగా, ఎమ్మెల్యేగా గెలుపొందిన ఎస్‌.ఎం. కృష్ణ.. కర్ణాటక ముఖ్యమంత్రిగా, విదేశాంగ శాఖ మంత్రిగా, స్పీకర్‌గా, గవర్నర్‌గా కీలక బాధ్యతల్లో పనిచేసిన ఎస్‌ ఎం కృష్ణ అసంతృప్తితో రాజకీయ సన్యాసం తీసుకోనున్నట్లుగా రాజకీయ వర్గాల సమాచారం. కాంగ్రెస్‌ అధిష్టానం తనను పూర్తిగా పక్కన పెట్టేయడంతో తీవ్ర అసంతృప్తికి లోనై ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేసి శాసనసభ ఎన్నికల సమయంలో బీజెపి తీర్ధం పుచ్చుకున్న మాజీ సీఎం ఎస్‌ఎం.కృష్ణ ఇక్క డ కూడా అదే పరిస్థితి ఎదురు కావడంతో రాజకీయ సన్యాసం తీసుకోవాలని సూత్రప్రాయంగా నిర్ణయించుకున్నట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. అతి త్వరలోనే ఎస్‌ఎం.కృష్ణ ఆత్మ కథ విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగే సభలో ఆయన క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకునే విషయాన్ని ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు.ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపిలపై తనకు పూర్తిగా భ్రమలు తొలగిపోయాయని కృష్ణ తన అనుచరుల వద్ద పేర్కొన్నట్లు తెలిసింది. 
 ఒక వేళ ఇదే కనుక జరిగితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ విజయాలపై ప్రభావం చూపడం తథ్యమని బీజెపి నేత ఒకరు తెలిపారు. కాగా ఎస్‌ఎం.కృష్ణ రాజకీయ సన్యాసం చేస్తూనే ఆయన రెండో కుమార్తె శాంభవి తండ్రి స్థానాన్ని భర్తీ చేసేందుకు తెరపైకి వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. మండ్య లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆమెను బరిలోకి దించాలని బీజేపి భావిస్తోంది.

Don't Miss