రేషన్ బియ్యం దందా..

18:36 - January 1, 2017

నిజామాబాద్‌: పేద ప్రజల కడుపునింపే బియ్యం పక్కదారి పడుతున్నాయి. అధికారుల పర్యవేక్షణాలోపంతో యథేచ్ఛగా రేషన్‌బియ్యం అక్రమార్కులకు చేరుతున్నాయి. నిజామాబాద్‌, కామారెడ్డిజిల్లాల్లో రేషన్‌ డీలర్లు ఆడిందే ఆటగా సాగుతోంది.

పక్కదారి పడుతున్న రేషన్ బియ్యం
పేదప్రజల ఆకలి తీర్చాల్సిన రేషన్‌ బియ్యం అవినీతిపరుల పాలవుతున్నాయి. అధికారులు, రేషన్‌డీలర్లు కుమ్మక్కై రూపాయిబియ్యాన్ని రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్నారు.

రెండు జిల్లాల్లో 6,22,321 ఆహార భద్రత కార్డులు
నిజామాబాద్‌ , కామారెడ్డిజిల్లాల్లో పరిధిలో మొత్తం 6,22, 321 ఆహారభద్రతా కార్డులు ఉన్నాయి. వీటికి ప్రతి నెల 13,322 మెట్రిక్ టన్నుల బియ్యం డీలర్లకు సరఫరా అవుతాయి. అయితే ప్రజలకు పంపిణీ మొదలు కాకముందే బియ్యం మాయమవుతున్నాయి. కొందరు అధికారులు, డీలర్లతో కుమ్మక్కై బియ్యాన్ని పొరుగున్న ఉన్న మహరాష్ర్టకు తరలిస్తున్నారు.

అర్సపల్లిలో-50క్వింటాళ్లు , వర్నిలో 350బస్తాలు పట్టివేత
గత 10 రోజుల్లొ రెండు ప్రాంతాల్లో అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని పౌరసరపరాలశాఖ అధికారులు పట్టుకున్నారు. అర్సపల్లిలో 50 క్వింటాళ్లు, వర్ని మండలంలో ఓ ఇంట్లొ నిల్వచేసిన సుమారుగా 350 బస్తాల బియ్యం అధికారులు పట్టుకున్నారు. ఈ బియ్యాన్ని మహారాష్ట్రకు తరలించి అమ్ముకుంటున్నారు.

రాజకీయనాయకులు అండతో రెచ్చిపోతున్న అక్రమార్కులు
బోదన్ మండలం సాలూర రెంజల్, నవీపేట యంచ, కోటగిరి మండలాల నుంచి రాత్రివేళలో రేషన్‌ బియ్యం సరిహద్దులు దాటిపోతున్నాయి. బియ్యం పక్కదారిపట్ట కుండా ప్రభుత్వం పీడీఎస్‌ చట్టాన్ని ప్రయోగిస్తున్నా బియ్యం అక్రమార్కుల గోడౌన్లకు చేరుతూనే ఉన్నాయి. నిజామాబాద్‌ పట్టణంలో సంవత్సరాలుగా ఈ దందా కొనసాగుతున్నా అధికారులకు కనిపంచడంలేదు.బియ్యం దందాలో కొందరు రైస్‌మిల్లర్ల హస్తంకూడా ఉన్నట్టు తెలుస్తోంది. రాజకీయనాయకుల అండదండలతోనే అక్రమార్కులు రెచ్చిపోతున్నారని స్థానికులు అంటున్నారు. హాస్టళ్లకు కేటాయించిన సన్నబియ్యం మిల్లులకు తరలించిన పాలిష్‌పట్టి.. ఎక్కువరేటుకు అమ్మకుంటున్నారనే ఆరోపణలొస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు రేషన్‌బియ్యం దందాను అడ్డుకోవాలని నిజామాబాద్‌, కామారెడ్డిజల్లాల ప్రజలు కోరుతున్నారు. 

Don't Miss