స్వాహా రాయుళ్లు..

18:36 - January 9, 2017

నిజామాబాద్‌ : బోధన్‌ మున్సిపాలిటీ అవినీతి కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. పైసలు ఇవ్వనిదే ఏపనీ పూర్తికాదన్న ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. పాలకవర్గం, సిబ్బంది, అధికారులు కుమ్మక్కై ప్రజలను పీల్చి పిప్పిచేస్తున్నారన్న విమర్శలు వస్తున్నా పట్టించుకునే దిక్కులేకుండా పోయింది.

బోధన్‌... నిజామాబాద్‌ జిల్లాలో ఒక పెద్ద పురపాలక సంఘం.
బోధన్‌... నిజామాబాద్‌ జిల్లాలో ఒక పెద్ద పురపాలక సంఘం. ఈ మున్సిపాలిటీకి ఇప్పుడు అవినీతి జబ్బు పట్టుకుంది. అవినీతికి అలవాటుపడ్డ సిబ్బంది, అధికారులు, పాలకమండలి సభ్యులు ఏకమయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందరూ కలిసి అన్ని విషయాల్లో కచ్చితంగా ఉంటున్న కమిషనర్‌కు పనిచేయలేని పరిస్థితి కల్పించారన్న విమర్శలు వస్తున్నాయి. అందరూ ఏకమై అందినకాడికి దండుకోవడమే పనిగా పెట్టుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రతి పని పూర్తి చేసేందుకు నిర్ధిష్ట కాలపరిమితి నిర్ణయం
బోధన్‌ మున్సిపాలిటీలో ప్రతి పనికి వెల నిర్ణయించారు.. అధికారులు, పాలకవర్గం అవినీతికి వ్యతిరేకంగా ప్రజా సంఘాలు నిరసన ప్రదర్శన నిర్వహించాలరంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పౌరసేవల పట్టిక ప్రకారం ప్రతి పని పూర్తి చేయడానికి నిర్ధిష్టకాలవ్యవధి నిర్ణయించారు. కాని ఇది పేరుకే. ఏదో ఒక వంకతో నెలల తరబడి పెండింగ్‌లో పెడతారు. అదే పైసలు ఎరగా చూపితే, నిబంధనలు బలాదూర్‌ అంటారు. రెండు లేదా మూడు నెలలు అపరిష్కృతంగా ఉన్న పనులు కూడా కాసులు చూపితే ఇట్టే అయిపోతున్నాయని ప్రజలు బాహాటంగానే చెబుతున్నారు.

అవినీతి ఇంజినీర్‌పై దాడికి యత్నించిన కౌన్సిలర్లు
బోధన్‌ మున్సిపల్‌ సివిల్‌ ఇంజనీర్‌ అవినీతి వ్యవహారాలు పురపాలక సంఘానికి పెద్ద మచ్చ తెచ్చిపెట్టాయి. కౌన్సిల్‌ సమావేశాల్లో పాలకవర్గ సభ్యులే సివిల్‌ ఇంజినీర్‌పై దాడికి ప్రయత్నించారంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చు.మున్సిపల్‌ ఇంజనీర్‌పై జిల్లా కలెక్టర్‌తోపాటు, మున్సిపల్‌ పరిపాలనా శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లినా చర్యలు లేకపోవడంతో మిగిలిన అధికారులకు ఇది అలసత్వంగా మారింది. దీంతో ఎవరి స్థాయిలో వారు దోపిడీకి తెరతీశారన్న ఆరోపణలు వెల్లువుతున్నాయి.

ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజులు బొక్కిన ఇద్దురు అధికారులపై సస్పెన్షన్‌ వేటు
అవినీతే కాదు నిధుల స్వాహా కూడా బోధన్‌ మున్సిపాలిటీకి పెద్ద జాడ్యంగా పరిణమించింది. షాపులు పెట్టుకునే వ్యాపారాల నుంచి వసూలు చేసే ట్రేడ్‌ లైన్స్‌ ఫీజును బొక్కిన ఇద్దరు అధికారులపై సస్పెన్షన్‌ వేటు పడిన తర్వాత కూడా పరిస్థితిలో మార్పురాలేదు. ఇందులో అధికారుల నుంచి పాలకవర్గం వరకు అందరిపాత్ర ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బోధన్‌ మున్సిపాటీ అవినీతి గురించి చెప్పుకుంటూ పోతే ఇదో పెద్ద గ్రంథమే అవుతుందని అంటున్నారు. ప్రజలను పట్టిపీడిస్తున్నఅవినీతి జలగలపై ఇకనైనా అధికారులు దృష్టి పెట్టాలని కోరుతున్నారు. 

Don't Miss