'టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే నుంచి నా ఇంటి స్థలాన్ని కాపాడండి'...

08:01 - May 18, 2018

రాజన్నసిరిసిల్ల : టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌ తన ఇంటి స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నాడని వేములవాడకు చెందిన బొల్లినేని వేంకటేశ్వర్‌రావు మున్సిపల్‌ కార్యలయంలో ధర్నాకు దిగారు.  తన భూమి ఎల్‌ఆర్ఎస్‌ ప్రొసిడింగ్‌ పత్రాలను ఇవ్వకుండా ఎమ్మెల్యే మున్సిపల్‌ అధికారులపై ఒత్తిడి తెస్తున్నాడని ఆరోపించారు. కష్టపడి సంపాదించిన డబ్బుతో ఇంటి స్థలాన్నికొనుగోలు చేస్తే ఎమ్మెల్యే తన ఇంటి రహదారి కోసం భూమిని స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నాడని వేంకటేశ్వర్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు.
మున్సిపల్‌ కార్యాలయంలో ధర్నాకు దిగిన బొల్లినేని వేంకటేశ్వర్‌రావు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన బొల్లినేని వేంకటేశ్వర్‌రావు అనే వ్యక్తి మున్సిపల్‌ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. మున్సిపల్‌ అధికారులు తన ఇంటి ఎల్‌ఆర్‌ఎస్ ప్రొసిడింగ్‌ పత్రాలను ఇవ్వటం లేదని ఆందోళన చేపట్టారు. కుటుంబ సభ్యులతో కలిసి ధర్నా చేపట్టారు.  టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌  తన నివాస ఇంటి పక్కన ఉన్న భూమిని కబ్జా చేసేందుక ప్రయత్నిస్తున్నారిని ఆయన ఆరోపించారు. సర్వే నెంబర్‌ 1380,1381, 1382, 1384లలో తనకు  6 గుంటల భూమి ఉందన్నారు. ఆ భూమిని ఎమ్మెల్యే  తన ఇంటికి రోడ్డుగా మార్చుకోవడానికి   వెంకటేశ్వర్‌రావు మండిపడుతున్నారు. తన భూమికి సంబంధించిన ఎల్‌ఆర్‌ఎస్ ప్రొసిడింగ్‌ పత్రాలను ఇవ్వకుండా.. ఎమ్మెల్యే మున్సిపల్ అధికారులపై ఒత్తిడి తెస్తున్నాడని ఆయన ఆరోపించారు. 
ఇంటి స్థలాన్ని నా భార్య లావణ్య పేరున రిజిస్టేషన్‌ చేయించా : వెంకటేశ్వర్‌రావు
ఇంటి స్థలాన్ని 5 సంవత్సరాల క్రితం.. ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుతో కొనుగోలు చేసినట్టు బాధితుడు తెలిపారు. ఈ భూమిని తన  భార్య లావణ్య పేర రిజిస్టేషన్ చెయించానని వెంకటేశ్వర్‌రావు చెప్పారు. లేఅవుట్ రెగ్యూలరైజేషన్‌ ప్రొసిడింగ్‌.. అలాగే ఎల్‌ఆర్‌ఎస్ రెగ్యులరైజేషన్‌ల కోసం మున్సిపాల్టీకి లక్ష 15 వేలు చెల్లించానని తెలిపారు. మున్సిపల్‌ అధికారులు ఎల్‌ఆర్‌ఎస్ కాగితాలను తయారు చేసి.. తనకు ఇచ్చే సమయంలో ఎమ్యేల్యే రమేష్ బాబు అడ్డుపుల్ల వేశారని ఆయన ఆరోపిస్తున్నారు.  మున్సిపల్‌ అధికారులు కుంటి సాకులు చెపుతూ.. కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారని వాపోయారు.  అధికారుల తీరుతో విసుగు చెందే.. కుటుంబంతో కలిసి ధర్నాకు దిగనని వెంకటేశ్వర్‌రావు స్పష్టం చేశారు. మున్సిపల్‌ చైర్మన్ నామాల ఉమ భర్త లక్ష్మిరాజం తనకు ఫోన్‌ చేసి 5 లక్షలు ఇస్తే ప్రొసిడింగ్‌ కాగితాలు ఇస్తానని... లేకపోతే కాగితాలు రాకుండా చేస్తానని బెదిరించాడని ఆయన ఆరోపించారు. 
ఎల్‌ఆర్‌ఎస్‌ కాగితాలు ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటా: బాధితుడు
వేంకటేశ్వర్‌రావు ఆందోళనకు దిగడంతో పోలీసులు అరెస్ట్‌ చేయడానికి ప్రయత్నించారు. అదే సమయంలో మీడియా అక్కడికి చేరుకోవడంతో పోలీసులు అరెస్ట్‌ ప్రయత్నాన్ని  విరమించుకున్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌ పత్రాలు ఇస్తేనే ఆందోళన విరమిస్తానని పోలీసులకు స్పష్టం చేశారు.  తనకు ఎల్‌ఆర్‌ఎస్‌  పత్రాలు ఇవ్వకుంటే మున్సిపల్‌ కార్యాలయం ముందే ఆత్మహత్య చేసుకుంటానని బాధితుడు హెచ్చరించారు. ఈ విషయంపై మున్సిపల్‌ కమిషనర్‌ను వివరణ కోరగా.. ఎస్‌ఆర్ఎస్‌ ప్రొసిడింగ్‌ ఇవ్వడానికి అన్ని లీగల్‌ కాగితాలు ఉన్నాయని.. కేవలం ఎమ్మెల్యే  ఇవ్వవద్దని ఒత్తిడి చేయడంతోనే ఆపామని స్పష్టం చేశారు.  అయితే ఈ మాటలను కమిషనర్ మీడియా ముందు చెప్పాడానికి ఇష్టపడలేదు. ఇప్పటికైనా తనకు న్యాయం చేయాలని బాధితుడు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

 

Don't Miss