ఫీజు 'జులుం'పై సీబీఐటీ స్టూడెంట్స్ ఆందోళన..

06:39 - December 7, 2017

రంగారెడ్డి : జిల్లా... గండిపేటలోని CBIT కళాశాల విద్యార్థులు ఆందోళనబాట పట్టారు. ఫీజుల పెంపునకు వ్యతిరేకంగా వందలాది మంది విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి.. ధర్నా చేశారు. కాలేజ్‌ యాజమాన్యం భారీగా ఫీజులను పెంచిందంటూ.. విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. లక్షా 13 వేలు ఉన్న ఫీజును రెండు లక్షలకు పెంచారని.. దీంతో తమ చదువులు ఆగిపోయేటట్టు ఉన్నాయని వాపోయారు. ఫీజులు చెల్లిస్తేనే పరీక్షలకు అనుమతిస్తామని ఒత్తిడి చేస్తున్నారని వారు ఆరోపించారు. విద్యార్థుల జీవితాలతో CBIT కాలేజ్‌ యాజమాన్యం చెలగాటమాడుతుందని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి.

అయితే కళాశాలలో మెరుగైన సదుపాయాలు కోసం ఫీజులు పెంచక తప్పలేదని.. ఈ విషయాన్ని ముందే విద్యార్థులకు చెప్పామని సీబీఐటీ ప్రిన్సిపాల్‌ రవీందర్‌రెడ్డి అంటున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే ఫీజులు పెంచామని సమర్థించుకున్నారు. అయితే విద్యార్థులు మాత్రం విద్యా సంవత్సరం మధ్యలో ఫీజులు పెంచడాన్ని తప్పుపడుతున్నారు. విద్యార్థుల ఆందోళనతో గండిపేట రోడ్డుపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Don't Miss