జైలు స్థలంలో గ్రౌండ్

08:09 - September 14, 2017

తూర్పుగోదావరి : రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలును సువిశాల ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. కారాగార స్థలమే కాకుండా చుట్టూరా మరో 20 ఎకరాల స్థలంలో వివిధ తోటలు కూడా ఉన్నాయి. అయితే ఆ స్థలాలన్నీ ప్రజావసరాలకు వినియోగించడంలో భాగంగా.. ఒక స్టేడియాన్ని నిర్మించాలంటూ గతంలో ఎంపీగా పనిచేసిన ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ప్రతిపాదించారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆ తర్వాత కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో ఉండవల్లి ప్రతిపాదనలు ఆచరణరూపం దాల్చడానికి ప్రయత్నాలు జరిగాయి. కానీ ఆతర్వాత అనూహ్యంగా ఆ ప్రయత్నాలు ఆగిపోయాయి. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ స్టేడియం నిర్మాణం చేయాలన్న ప్రతిపాదనలను తీవ్రంగా వ్యతిరేకించింది. నగరం మధ్యలో అలాంటి ప్రయత్నాలు చేయకూడదంటూ ఆందోళన నిర్వహించింది.

నాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ఇప్పుడు
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ఇప్పుడు అధికారపక్షంలో కూర్చొంది. నేతల తీరులోనూ మార్పు వచ్చింది. నాడు స్టేడియం నిర్మాణాన్ని వ్యతిరేకించిన వారే ఇప్పుడు నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్టేడియం నిర్మాణం ప్రతిపాదనలు ముందుకు తీసుకురావడంతో మరోసారి రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలు భూములపై మరోసారి చర్చ మొదలైంది. స్టేడియం నిర్మాణంతోపాటూ కన్వెన్షన్‌ సెంటర్‌ కూడా జైలు స్థలంలోనే నిర్మిస్తామని సీఎం ప్రకటించారు. వాస్తవానికి జైలు స్థలాన్ని ఇతర అవసరాలకు వినియోగించాలన్న ప్రతిపాదనలపై గతంలోనే జైళ్లశాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వ పెద్దల ప్రయత్నాలకు సహకరించకపోవడంతో అప్పట్లో ప్రతిపాదనలకు ఆటంకాలు ఏర్పడ్డాయి.

నాటి ప్రజాప్రతినిధులు వ్యతిరేకిస్తున్నారు...
అయితే ఇప్పుడు మరోసారి అదే అంశం ముందుకురావడంతో నాటి ప్రజాప్రతినిధులు వ్యతిరేకిస్తున్నారు. తాము పేదల ప్రయోజనాల కోసం ప్రతిపాదన చేస్తే కాదని... ఇప్పుడు కన్వెన్షన్‌ సెంటర్ల పేరుతో కార్పొరేట్‌ ప్రయోజనాలు నెరవేర్చడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కుడి ఎడమైనట్టు ఒకప్పుడు వ్యతిరేకించిన వారే ఇప్పుడు దాన్ని సమర్ధిస్తున్నారు. అప్పుడు సమర్ధించిన వారు ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకమాట, ప్రతిపక్షంలో మరోమాట మాట చెబుతూ విస్తుగొలుపుతున్నారు. మరి జైలు స్థలాల కథ ఏ మలుపు తీసుకుంటుందో వేచిచూడాలి.

Don't Miss