బీజేపీది అనైతికమన్న బాబు..అప్పుడు తెలియదా ?

21:09 - May 17, 2018

ప్రకాశం : బీజేపీ అనైతిక రాజకీయాలతో కర్నాటకలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. మెజారిటీ ఉన్న కాంగ్రెస్‌, జేడీఎస్‌ కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ ఆహ్వానించకపోవడాన్ని బాబు తప్పుపట్టారు. కర్నాటక విషయంలో బీజేపీ అధినాయకత్వం రాజ్యాంగ విరుద్ధంగా, అనైతికంగా వ్యవహరించిందని ప్రకాశం జిల్లా పోకూరు సభలో చంద్రబాబు మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకాశం జిల్లాలో పర్యటించారు. నీరు-ప్రగతి స్కీం కింద.. వలేటివారిపాలెం మండలం పోకూరు చెరువులో జరుగుతున్న పూడికతీత పనులను పర్యవేక్షించారు. పోకూరు సభలో ప్రసంగించిన చంద్రబాబు కర్నాటక రాజకీయ పరిణామాలపై స్పందించారు. ఆ రాష్ట్రంలో అతిపెద్ద రాజకీయ కూటమిగా అవతరించిన కాంగ్రెస్‌, జేడీఎస్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ ఆహ్వానించకపోవడాన్ని ముఖ్యమంత్రి తప్పుపట్టారు. బీజేపీ అప్రజాస్వామికంగా, అనైతికంగా, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల మధ్య కుల, మత, ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టి, విభజించి పాలించడంలో బీజేపీ నాయకులు బ్రిటీషు పాలకులను మించిపోయారని చంద్రబాబు మండిపడ్డారు.

విభజనతో నష్టపోయిన రాష్ట్రానికి న్యాయం చేస్తుందని గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తుకుంటే.. చివరికి మొండిపోయి చూపారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీతో కలిసి నాటకాలాడుతున్న ప్రతిపక్ష నేత జగన్‌.. గోదావరి లాంచీ ప్రమాద మృతుల కుటుంబాలను పరామర్శించకపోవడాన్ని చంద్రబాబు తప్పు పట్టారు. నూకవరం ఎస్సీ కాలనీలో చంద్రబాబు... ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్షించారు. ఎస్సీ కార్పొరేషన్‌ ఆర్థిక సహాయంలో 11 మంది లబ్దిదారులకు ఇన్నోవా కార్లు పంపిణీ చేశారు. ఆ తర్వాత బడేవారిపాలెంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో రైతులతో ముఖాముఖి నిర్వహించారు. అమరావతి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయల విరాళం ఇచ్చిన నరసింహంను చంద్రబాబు అభినందించారు.

ప్రకాశం జిల్లాలో రాళ్లపాడు ఎత్తిపోతల ప్రాజెక్టు పెండింగ్‌ పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఏడాది డిసెంబర్‌ నుంచి వెలిగొండ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చంద్రబాబు చెప్పారు. 

Don't Miss