'హోదా' పోరులో టిడిపి...

21:13 - April 6, 2018

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందంటూ.. తెలుగుదేశం పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిరసన ర్యాలీలు చేపట్టాయి. అన్ని జిల్లాల్లోనూ మండలస్థాయి వరకూ.. సైకిల్‌, బైక్‌ ర్యాలీలు నిర్వహించారు. చంద్రబాబు కూడా.. అసెంబ్లీ వరకూ సైకిల్‌ ర్యాలీ నిర్వహించి తన నిరసనను తెలియపరిచారు. మోదీ ప్రభుత్వం రాష్ట్రంపై కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తోందంటూ.. ర్యాలీల్లో పాల్గొన్న నేతలు విమర్శించారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంపై... కేంద్రంలోని మోదీ ప్రభుత్వ తీరుకు నిరసనగా.. తెలుగుదేశం పార్టీ.. ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పటికే, నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతోన్న తెలుగు దేశం శ్రేణులు.. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా.. సైకిల్‌, బైక్‌ ర్యాలీలు నిర్వహించాయి. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. రాజధాని అమరావతి సమీపంలోని వెంకటపాలెం గ్రామంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులు అర్పించాక, సచివాలయం వరకూ సైకిల్‌ తొక్కుతూ వెళ్లారు. కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యే హోదా ఇచ్చి తీరాల్సిందేనని చంద్రబాబు నాయుడు సైకిల్‌ ర్యాలీ ప్రారంభోత్సవం సందర్భంగా అన్నారు.

తెలుగువారితో పెట్టుకున్న వారికి కాంగ్రెస్‌కు పట్టినగతే పడుతుందని హెచ్చరించారు. అనంతపురం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ తెలుగుదేశం శ్రేణులు సైకిల్‌, బైక్‌ ర్యాలీలు నిర్వహించాయి. అనంతపురం నగర మేయర్‌ స్వరూప, పాతవూరులోని గాంధీ విగ్రహాన్ని అభిషేకించి, పళ్లెంతో డప్పు కొడుతూ ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇదే జిల్లా కదిరి నియోజకవర్గంలో ప్రత్యేక హోదా హామీ అమలు కోరుతూ.. తెలుగుదేశం, వైసీపీ నాయకులు విడివిడిగా బైక్‌ ర్యాలీలు నిర్వహించాయి. కడప జిల్లాలో టీడీపీ శ్రేణులు బైక్‌ ర్యాలీ నిర్వహించాయి. పులివెందులలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ సతీశ్‌రెడ్డి నేతృత్వంలో టీడీపీ కార్యకర్తలు బైక్‌ ర్యాలీ నిర్వహించారు.

ఢిల్లీలోఅన్ని పక్షాల మద్దతు కూడగడుతున్న తమ అధినేతను, జగన్మోహన్‌రెడ్డి విమర్శించడంపై సతీశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు ప్రొద్దుటూరులో టీడీపీ ఇంఛార్జి వరదరాజులు రెడ్డి నేతృత్వంలో పార్టీ శ్రేణులు బైక్‌ ర్యాలీలు పాల్గొన్నాయి. హోదా కోసం ఎంతగానో శ్రమిస్తున్న చంద్రబాబును కేంద్రం వేధిస్తోందని, దీనికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని టీడీపీ నాయకులు హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లాలోనూ టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున బైక్‌ ర్యాలీ నిర్వహించారు. కాకినాడలోని ప్రధాన రహదారుల్లో టీడీపీ కార్యకర్తలు భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. పెద్దాపురంలో మున్సిపల్‌ చైర్మన్‌ ఆధ్వర్యంలో పెద్దాపురం నుంచి సామర్లకోట వరకూ బైక్‌ర్యాలీ నిర్వహించారు.

రాజమండ్రి నగరంలో తెలుగుదేశం నాయకులు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా నగరపాలక సంస్థకు చెందిన కార్పొరేటర్లు, ఇతర నాయకులు బైక్‌ ర్యాలీలో భారీ ఎత్తున పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో టీడీపీ శ్రేణులు బౌక్‌ ర్యాలీ నిర్వహించి, స్థానిక అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళులు అర్పించారు. కేంద్రం వైఖరికి నిరసనగా అంబేడ్కర్‌ సెంటర్‌లో అర్ధనగ్నంగా బైఠాయించారు. అనంతరం అదే సర్కిల్‌లో మానవహారంగా ఏర్పడ్డారు. శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం నాయకులు భారీ బైక్‌ ర్యాలీ తీశారు. పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ సర్కిల్‌లో మానవహారంగా ఏర్పడ్డారు. అక్కడే, ఆర్టీసీ బస్సులను శుభ్రం చేయడం ద్వారా వినూత్నరీతిలో నిరసన తెలిపారు. కర్నూలు, ప్రకాశం, నెల్లూరు తదితర జిల్లాల్లోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ తెలుగుదేశం నాయకులు భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఎక్కడికక్కడ.. బీజేపీ వైఖరిపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. 

Don't Miss