ముందస్తు ఎన్నికల ప్రస్తావన తెచ్చిన చంద్రబాబు

19:33 - April 21, 2017

అమరావతి: ఏపీ ముఖ్యమత్రి చంద్రబాబు ముందస్తు ఎన్నికలకు వెళ్లనున్నారన్న భావన వ్యక్తమవుతోంది. విజయవాడలోని చంద్రబాబు నివాసంలో, శుక్రవారం జరిగిన తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ భేటీ ఈమేరకు సంకేతాలను వెలువరించింది. రాష్ట్రస్థాయి ముఖ్య నేతలు పాల్గొన్న ఈ భేటీలో, ముందస్తు ఎన్నికల ప్రస్తావన తెచ్చిన చంద్రబాబు.. వివిధ పార్టీల బలాబలాలను విశ్లేషించారు.

సర్వే ఫలితాలను మదింపు చేసిన చంద్రబాబు

పార్టీ తరచుగా నిర్వహిస్తున్న సర్వేల ఫలితాలను కూడా చంద్రబాబు సమన్వయ కమిటీ భేటీలో మదింపు చేశారు. గత సంవత్సరంతో పోల్చితే, టీడీపీ ఓట్ల శాతం 16.13 శాతానికి పెరగ్గా, వైసీపీ ఓట్ల శాతం 13.45 శాతానికి తగ్గిందని చంద్రబాబు వివరించారు . ప్రస్తుత ఓటు బ్యాంకును కాపాడుకుంటూనే, కొత్త ఓటు బ్యాంకును సమకూర్చుకోవాలని సూచించారు. ఎన్నికలు సమీపిస్తున్న కారణంగా, ఇకపై ప్రతిరోజూ సాయంత్రం ఆరు గంటల నుంచి పార్టీ వ్యవహారాలపైనే ఎక్కువ ఫోకస్‌ పెడతానని చంద్రబాబు తెలిపారు. విమర్శలు ఎక్కుపెడుతున్న సొంత పార్టీ నేతలపై సీరియస్‌గా ఉంటానన్న సీఎం, ఇసుక విషయంలో కొందరు నేతల స్వార్థం, పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చిందని వ్యాఖ్యానించారు.

మహానాడు నిర్వహణపై చర్చ...

మహానాడు నిర్వహణ గురించి కూడా సమావేశంలో చర్చించారు. ఇప్పటికే రెండుసార్లు తెలంగాణలో, ఓసారి రాయలసీమలో నిర్వహించిన కారణంగా ఈసారి ఉత్తరాంధ్రలో మహానాడు నిర్వహించాలని నేతలు చంద్రబాబుకు సూచించారు. తెలంగాణ పార్టీ నేతలతో చర్చించాక వేదిక ఖరారు చేద్దామని చంద్రబాబు తెలిపారు. ఇదే సమయంలో పాల్గొన్న మంత్రి నారా లోకేశ్‌ , పార్టీ గ్రామ కమిటీ ఎన్నికలను త్వరగా పూర్తి చేయాలని, సమర్థ నాయకులను సంస్థాగత ఎన్నికల కమిటీల్లో నియమించాలని సూచించారు. 

Don't Miss