ప్రత్యేక హోదాపై పోరాటానికి టీడీపీ సిద్ధమవుతోంది

21:43 - July 21, 2018

ఢిల్లీ : ప్రత్యేక హోదాపై పోరాటం చేసేందుకు టీడీపీ సిద్ధమవుతోంది. కేంద్రంపై తాము పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయినా... తమ సమస్యలు దేశం దృష్టికి తీసుకువచ్చామని టీడీపీ సంతృప్తి వ్యక్తం చేస్తోంది. కేంద్రాన్ని ఇరుకున పెట్టేందుకు పార్లమెంట్‌ వెలుపలా, లోపలా పోరాటాలు ఉధృతం చేయాలని చంద్రబాబు ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీలు నెరవేర్చమని డిమాండ్‌ చేస్తే... తనపైనే విమర్శలు చేయడం ఎంతవరకు సబబు అని చంద్రబాబు ప్రశ్నించారు. 

కేంద్రంపై తాము పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతిచ్చిన పార్టీలకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంట్‌లో మోదీ సర్కార్‌కు సంఖ్యాబలం ఉందని తెలిసినా రాష్ట్రానికి ఇచ్చిన హామీలు విస్మరించడంతో అవిశ్వాస తీర్మానం పెట్టామని ఢిల్లీలో చంద్రబాబు తెలిపారు. అవిశ్వాస తీర్మానం సందర్బంగా మద్దతిచ్చిన పార్టీలు.. భవిష్యత్‌లోనూ ప్రజలకు న్యాయం చేసేందుకు సహకరిస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 15 ఏళ్ల తర్వాత కేంద్రంపై తామే అవిశ్వాస తీర్మానం పెట్టామన్నారు. మెజారిటీకి, నైతికతకు మధ్య పోరాటం జరుగుతుందని... ప్రజలకు విశ్వాసం కల్పించాల్సిన కేంద్రం... ఆ పని చేయలేకపోయిందని చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు. 

రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని నాలుగేళ్లుగా ప్రధాని మోదీని కలిసి విన్నవించినా పట్టించుకోలేదన్నారు. ఓపిక నశించాకే మంత్రివర్గం నుంచి తప్పుకున్నామని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వొద్దని 14వ ఆర్ధికసంఘం చెప్పిందనడం అవాస్తవమని... ఆర్ధికసంఘం సభ్యుడు టి.గోవిందరావు అలాంటి సిఫార్సు చేయలేదన్నారు. 

రాష్ట్ర విభజనతో నష్టపోయామని.. ఆదుకోమని అడిగితే తమ పైనే విమర్శలు చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. ఎవరికీ ప్రత్యేక హోదా లేదని చెబుతున్న కేంద్రం.. ఇప్పటికీ 11 రాష్ట్రాలకు రాయితీలు ఇస్తున్నారన్నారు. తాను యూ టర్న్‌ తీసుకున్నానని.. వైసీపీ ట్రాప్‌లో పడ్డారని మోదీ అనడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. విభజన తర్వాత రాష్ట్ర సమస్యలు పరిష్కరించడంతో కేసీఆర్‌ పరిణితితో వ్యవహరించిందని నన్ను విమర్శించడం ప్రధాని స్థాయికి తగదన్నారు. తాను ఇప్పుడున్న వారికంటే ముందుగానే సీఎం అయ్యానని... రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నెరవేర్చమని అడిగితే.. విమర్శలు చేయడం ఎంతవరకు సబబు అని చంద్రబాబు ప్రశ్నించారు. 

ప్రధాని మోదీ ఇచ్చిన సమాధానంపై టీడీపీ ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర సమస్యలపై టీడీపీ అవిశ్వాసం పెడితే... ఆ అంశాలపై చర్చించకుండా రాజకీయాలు మాట్లాడారన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా పక్కదారి పట్టించారంటున్నారు. తమ హక్కులను సాధించుకోవడం పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఎంపీలు అన్నారు. 

కేంద్రంపై తాము పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోవడంతో టీడీపీ భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటించింది. ఢిల్లీలో ఎంపీలతో భేటీ అయిన చంద్రబాబు పార్లమెంట్‌లో ఏ విధంగా పోరాటం చేయాలో దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్‌ ఆవరణలో ప్లకార్డులతో ఆందోళనలు చేపట్టాలని సూచించారు. కేంద్రాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పోరాటం చేయాలని చంద్రబాబు సూచించారని ఎంపీలంటున్నారు. తాము రాజీనామా చేయబోమని... సభలోనే ఉండి రాష్ట్ర హక్కుల కోసం పోరాడుతామంటున్నారు. మొత్తానికి ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఎంపీలు ప్రత్యక్ష కార్యాచరణకు దిగబోతున్నారు. రాష్ట్రానికి కేంద్రం చేసిన మోసాన్ని ఎండగడుతూ పార్లమెంట్‌ లోపల, వెలుపల ఆందోళన చేయనున్నారు. 

Don't Miss