చంద్రబాబు రూటు మార్చారు...

20:01 - September 13, 2017

విజయవాడ : టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రూటు మార్చారు. మొన్నటి వరకూ పాలనపైనే ఎక్కువ ఫోకస్ చేసిన చంద్రబాబు తాజాగా ఎమ్మెల్యేల పనితీరును  సీరియస్‌గా మానిటర్ చేస్తున్నారు. పని తీరు బాగుంటేనే  వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇస్తానంటూ చంద్రబాబు స్పష్టం చేయడంతో తెలుగు తమ్ముళ్ల గుండెల్లో  రైళ్లు పరుగెడుతున్నాయి.  .

టిడిపి అధినేత.. సీఎం చంద్రబాబు నాయుడు పార్టీపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఓవైపు పాలనా కార్యక్రమాలు చూసుకుంటూనే  మరోవైపు పార్టీకి వీలైనంత సమయం కేటాయిస్తున్నారు. ఇక నుండి రియల్ టైమ్ పాలిటిక్స్ చేస్తానంటూ తాజాగా  ఆయన చేసిన కామెంట్స్ తెలుగు తమ్ముళ్లలో గుబులు పుట్టిస్తున్నాయి.  ఎమ్మెల్యేలపై చంద్రబాబు చేయిస్తున్న వరుస సర్వేలతో వచ్చే ఎన్నికల్లో తమ బెర్త్ ఉంటుందా? లేక ఊడుతుందా అన్న ఆందోళన తెలుగు తమ్ముళ్లలో కనిపిస్తోంది.

ఇటీవ‌ల చంద్రబాబు చేయించిన స‌ర్వేలో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వారిలో మెజార్టీ ఎమ్మెల్యేల పనితీరు బాగా లేదని తేలడంతోపాటు.. కొందరిపై అవినీతి ఆరోపణలు తీవ్రస్ధాయిలో ఉన్నట్లు తేలింది. అలాగే కొందరు ఇంచార్జ్‌లు కూడా నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదని తేలింది. దీంతో ఇంచార్జ్‌లను మార్చాలనే యోచనలో ఉన్నారు చంద్రబాబు. ఇక ఎమ్మెల్యేల పని తీరును కూడా సర్వేల ద్వారా తెలుసుకుంటున్న చంద్రబాబు పార్టీ అంతర్గత సమావేశాలు జరిగినప్పుడల్లా సూచనలు చేస్తూనే ఉన్నారు. పని తీరు సరిచేసుకోకపోతే వచ్చే ఎన్నికలకు టికెట్ ఉండదనే హెచ్చరికలు పంపిస్తున్నారు. అటు యువనేత లోకేశ్ సైతం ఇదే అంశాన్ని నేతల వద్ద ప్రస్తావిస్తున్నట్లు తెలుస్తోంది. 

వ‌చ్చే ఎన్నిక‌ల‌కు 175 టార్గెట్ గా పెట్టుకున్న చంద్రబాబు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.  ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ని పక్కన పెట్టి పనిచేయాలని నేతలకు హితబోధ చేస్తున్నారు. మ‌రి బాబు మాటలు నేత‌లు సీరియ‌స్ గా తీసుకుంటారా? లేక లైట్ తీసుకుంటారా? అనేది వేచి చూడాలి. 

Don't Miss