టీటీడీ పాలకమండలి ఏర్పాటు దిశగా చర్యలు

12:02 - January 11, 2018

చిత్తూరు : టీటీడీ బోర్డు ఏర్పాటు అంశం టీడీపీ సర్కార్‌కు ప్రహసనంగా మారింది. గత పాలకవర్గం గడువు ఏప్రిల్‌తో ముగిసినా సీఎం చంద్రబాబు ఇప్పటివరకూ కొత్త బోర్డును ఏర్పాటు చేయలేకపోయారు. మిత్రపక్షమైన బీజేపీ పెద్దలు లెక్కకు మించి సిఫార్సులు చేస్తుండమే ఈ జాప్యానికి కారణమని టీడీపీ వర్గాలు అంటున్నాయి. 2014లో ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏడాదిపాటు బోర్డు లేకుండానే కాలం గడిచిపోయింది. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబుతో సహా జేఈవో టీడీపీ నేతల్ని అవమానించారంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక అవన్నీ మర్చిపోయి అదే జేఈవోతో కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా వేయాల్సిన బోర్డులో తీవ్ర పోటీ నెలకొంది. ఎవరికి వారు తమకు ఒక అవకాశం ఇవ్వాలని చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు వడపోసి టీటీడీ బోర్డును సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సంక్రాంతి పండుగ అనంతరం కొత్తబోర్డు ఏర్పాటుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు సమాచారం.

చైర్మన్ రేసులో పుట్టా సుధాకర్ యాదవ్
ఇక టీటీడీ బోర్డు చైర్మన్‌గా ఎప్పటి నుండో వినిపిస్తున్న పుట్టా సుధాకర్ యాదవ్ పేరే చైర్మన్ రేసులో ముందుంది. చంద్రబాబు పుట్టా సుధాకర్‌నే ఈసారి టీటీడీ చైర్మన్‌గా నియమించాలని నిర్ణయించినట్లు సమాచారం. ముందుగా ఈ పదవి కోసం మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు, మాజీ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ, ఎంపీ రాయపాటి సాంబశివరావు, మరో ఎంపీ మాగంటి మురళీమోహన్‌లు పోటీపడ్డారు. అయితే పదవుల్లో ఉన్నవారికి నో ఛాన్స్ .. అని చెప్పడంతో వారంతా పోటీ నుంచి తప్పుకున్నారు. ఆర్ధికమంత్రి యనమలకు సుధాకర్ యాదవ్ వియ్యంకుడు కావడంతో పాటు... స్ధానికంగా మాజీ మంత్రి డీఎల్.రవీంద్రారెడ్డికి వచ్చే ఎన్నికల్లో మైదుకూరు టికెట్ ఇవ్వాలని భావిస్తుండటంతో సుధాకర్ యాదవ్ ఎంపికకు మార్గం సుగమమైనట్లు తెలుస్తోంది. కాగా..అప్పట్లో పుట్టా అన్యమతస్తుడనే వివాదం చెలరేగడంతో సీఎం నిర్ణయం సందిగ్ధంలో పడింది. దీనిపై సీఎం ఉన్నతస్ధాయి విచారణ కూడా జరిపించారు. విచారణలో సుధాకర్ యాదవ్‌పై వచ్చిన వివాదం అవాస్తవం అని తేలడంతో ఆయనకే పదవి కట్టబెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

కేంద్రం నుంచి చైర్మన్ పదవి కోసం
అటు కేంద్రం నుంచి చైర్మన్ పదవి కోసం తమ వారికి అవకాశం కల్పించాలని ముగ్గురి పేర్లు రాష్ట్ర ప్రభుత్వానికి పంపినట్లు తెలుస్తోంది. మరోవైపు బోర్డు పదవుల కోసం గత పాలక మండలిలో ఉన్నవారిలో అత్యధికులు ఈసారి కూడా సభ్యత్వం ఆశిస్తున్నారు. అయితే ఈసారి కొత్తవారికి అవకాశమివ్వాలని అధిష్ఠానం యోచిస్తోంది. రాష్ట్ర పార్టీ కార్యాలయ కార్యదర్శి ఏవీ రమణ గత పాలకమండలిలో నిజాయితీ పనిచేశారనే పేరుండటంతో మరోసారి ఆయనకు అవకాశం దక్కవచ్చని తెలుస్తోంది. గత పాలకమండలిలో సభ్యుడిగా ఉన్న తెలంగాణ రాష్ట్ర సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కూడా మరోసారి అవకాశం కోసం ప్రయత్నిస్తున్నారు. అటు ప్రతిపక్ష నేత జగన్ సైతం పాదయాత్రలో టీటీడీ బోర్డు నియమించకపోవడంపై విమర్శలు గుప్పించారు. అదే విధంగా ఇటీవల వైకుంఠ ఏదాదశి సందర్భంగా కొండపై జరిగిన పరిణామాలను చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు తెలుగు తమ్ముళ్లు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో బోర్డు జాప్యం తగదని చంద్రబాబు డిసైడైనట్లు తెలుస్తోంది. ఇక అధికారికంగా ఎవరు చైర్మన్.. ఎవరు పాలకమండలి సభ్యులు తెలియాలంటే సంక్రాంతి పండుగ వెళ్లేవరకూ ఆగాల్సిందే. 

Don't Miss