పేదవాడికి అండగా ఉండడమే నా లక్ష్యం : చంద్రబాబు

21:23 - September 8, 2017

అనంతపురం/కర్నూలు : ఏపీ సీఎం చంద్రబాబు కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పర్యటించారు.. ముందు కర్నూలు జిల్లా చేరుకున్న సీఎం.... ముచ్చుమర్రి ఎత్తి పోతల పథకాన్ని ప్రారంభించారు... నదికి జలహారతి ఇచ్చారు.. హంద్రినీవా సుజల స్రవంతి మొదటి దశ రెండో ప్యాకేజీలో భాగంగా నిర్మించిన ముచ్చుమర్రి ఎత్తిపోతల ద్వారా.. కర్నూలు, కడప, చిత్తూర్‌, అనంతపూర్‌ జిల్లాల్లోని 6లక్షల ఎకరాలకు సాగునీరు. 33 లక్షలమందికి తాగునీరు అందనుంది. శ్రీశైలం రిజర్వాయర్‌ బ్యాక్‌ వాటర్‌ ద్వారా 40 టీఎంసీల నీటిని ఎత్తిపోతల పథకం ద్వారా తరలిస్తారు.

పోలవరం పూర్తి చేసి తీరతా
పేదవాడికి అండగా ఉండడమే తన జీవితాశయమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా పోలవరం పూర్తి చేసి తీరతామని తేల్చిచెప్పారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని మేఘా ఇంజనీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థ పూర్తి చేసింది. పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్నీ అనుకున్న సమయానికంటే ముందే పూర్తిచేసి లిమ్కా బుక్‌లో చోటు దక్కించుకున్న ఈ సంస్థ, ముచ్చుమర్రి ఎత్తిపోతలను కూడా రెండేళ్ల వ్యవధిలోనే పూర్తి చేసింది. మేఘా సంస్థ పనితీరును ప్రశంసించిన చంద్రబాబు... సంస్థ ఎండీ కృష్ణారావును ముచ్చుమర్రి సభలో సన్మానించారు.. ఈ సందర్భంగా, ప్రాజెక్టు పూర్తికి కృషి చేసిన మిగతా అధికారులనూ సత్కరించారు.

ఇంద్రావతి దగ్గర జలహారతి
ముచ్చుమర్రి నుంచి చంద్రబాబు అనంతపురం జిల్లాకు వెళ్లారు. ఉరవకొండ ఇంద్రావతి దగ్గర జలహారతి ఇచ్చారు.. అనంతరం బహిరంగ సభలో పాల్గొన్నారు. అనంతపురం జిల్లాను పండ్ల తోటల హబ్‌గా మారుస్తామని సీఎం ప్రకటించారు.. అవినీతి లేని పాలనే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.. ప్రజలు తమకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా 1100 నెంబర్‌ ఫోన్‌ చేయాలని... వెంటనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రెండు జిల్లాల పర్యటనల్లో బిజీ బిజీగా గడిపిన చంద్రబాబు.. సీమ వాసులపై వరాలు కురిపించారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా.. ఆయా సభల్లో ఏర్పాటు చేసిన చిన్నారుల నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

Don't Miss