కడపలో రెండో రోజు జన్మభూమి

21:45 - January 3, 2018

కడప : జిల్లా పులివెందులలో జరిగిన రెండోరోజు జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ రోజు జన్మభూమిలో ఆరోగ్యం-ఆనందంపై అంశానికి ప్రాధాన్యతనిచ్చారు. తొలిరోజు జన్మభూమి కార్యక్రమం విజయవంతమైందన్నారు చంద్రబాబు. 16 వేల గ్రామాలు, వార్డులలో అతిపెద్ద ప్రజాసేవ కార్యక్రమమైన జన్మభూమి కొనసాగుతుందన్నారు. మిగతా రోజుల్లోనూ అన్ని అంశాలపై చర్చిస్తామన్నారు. ప్రభుత్వ పథకాలు పేదలకు సరిగా చేరుతున్నాయా ? లేదా... అనే అంశాలను పరిశీలిస్తామన్నారు . అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్‌ ముందుకు వెళ్తుందన్నారు చంద్రబాబు. ఎవరూ సహకరించకపోయినా రైతులకు రుణ విముక్తి చేశామన్నారు. డ్వాక్రా సంఘాలకు సృష్టికర్తని తానే అన్న చంద్రబాబు.. సాధికారమిత్ర ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నామన్నారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశామని అదే సమయంలో ప్రజలకు ఇబ్బంది లేని సుపరిపాలనకు నాంది పలికామన్నారు సీఎం. తినే తిండి, తాగే నీరు, పరిసరాల పరిశుభ్రత, జీవన విధానంపై మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుందన్నారు చంద్రబాబు. అందరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజా సంతృప్తే అభివృద్ధి, సంక్షేమానికి కొలమానని చంద్రబాబు అన్నారు.

రాజశేఖర్‌రెడ్డిని పొగడడంతో వాగ్వాదం
ఇక ఈరోజు జన్మభూమి కార్యక్రమానికి స్థానిక ఎంపీ అవినాష్‌రెడ్డి హాజరయ్యారు. సభలో మాట్లాడుతూ.. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిని పొగడడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. జిల్లాలో వైఎస్‌ ఎన్నో అభివృద్ధి పనులు చేశాన్నారు. వైఎస్ హయాంలో గండికోట, చిత్రావతి పనులు 85 శాతం పూర్తి అయ్యాయని.. టీడీపీ ప్రభుత్వం చేసింది 15 శాతం పనులేనన్నారు అవినాష్‌రెడ్డి. దీంతో కొంతమంది టీడీపీ కార్యకర్తలు అవినాష్‌రెడ్డి ప్రసంగాన్ని అడ్డుకోవడంతో సభలో కాసేపు గందరగోళం నెలకొంది. 

సభలోనే గందరగోళం చేయాలని చూస్తున్నారు..
అనంతరం మాట్లాడిన చంద్రబాబు... తన సభలోనే గందరగోళం చేయాలని సృష్టించాలనుకోవడం సరికాదన్నారు. జన్మభూమి సభలో రాజకీయాలు మాట్లాడడం సరికాదన్నారు. కుప్పం కంటే పులివెందులకే ముందుగా నీరిచ్చామని గుర్తు చేశారు. రాయలసీమను రతనాలసీమగా మారుస్తామని స్పష్టం చేశారు. పెండింగ్‌ పనులన్నీ పూర్తి చేస్తామని... ఇంకా ఏవైనా కావాలంటే వినతిపత్రం ఇస్తే పరిశీలిస్తామన్నారు చంద్రబాబు. జన్మభూమిలో భాగంగా చంద్రబాబు.. గండికోట చిత్రావతి ఎత్తిపోతలను జాతికి అంకితం చేశారు. ఎత్తిపోతల జలాలకు పూజలు చేసి సీఎం హారతిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దేవినేని, సోమిరెడ్డి, ఆదినారాయణ రెడ్డి పాల్గొన్నారు. 

Don't Miss