జైట్లీకి బాబు లేఖ..

21:18 - January 10, 2018

విజయవాడ : ప్రత్యేక ప్యాకేజీ అమలుపై చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీకి రాసిన లేఖలో.. ప్రత్యేక ప్యాకేజీలో పేర్కొన్న విధంగా... రాష్ట్రానికి ఆర్థిక సాయాన్ని... విదేశీ ఆర్థిక సంస్థలనుంచి కాకుండా నాబార్డు నుంచి గ్రాంట్‌ రూపంలో అందించాలని కోరారు. 2020 వరకు రాష్ట్రానికి 16,447 కోట్లు రావాల్సి ఉంటుందని లేఖలో పేర్కొన్నారు. నాబార్డ్‌ నుంచి రుణం అందిస్తేనే కొత్త రాష్ట్రాలకు వెసులుబాటు ఉంటుందన్నారు. 

''కేంద్ర ప్రాయోజిత పథకాల వాటాను 90:10 నిష్పత్తిలో ఇచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్‌కు 2015-16 సంవత్సరానికి రూ. 2,951 కోట్లు  అధికంగా నిధులు రావాల్సి ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం దాన్ని 2,516కోట్ల రూపాయలుగా మాత్రమే అంచనా వేసింది. అదే సూత్రం ప్రకారం 2016-17 ఆర్థిక సంవత్సరానికి 2,854 కోట్లరూపాయలు రావాల్సి ఉంది. 2015-16 తో పోలిస్తే ఇది 13.43శాతం అధికం. అదే వృద్ధిరేటు ప్రకారం చూస్తే 2017-18కి 3,238 కోట్ల రూపాయలు. 2018-19కి 3,673 కోట్ల రూపాయలు, 2019-20కి 4,166 కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. కేంద్రం వేసిన తాత్కాలిక లెక్కల ప్రకారం ఐదేళ్ల కాలానికి 16,447 కోట్ల రూపాయలు ఈ పద్దు కింద ఇవ్వాల్సి ఉందని ముఖ్యమంత్రి తన లేఖలో పేర్కొన్నారు. దీనికి తోడు ప్రత్యేక క్యాటగిరీ రాష్ట్రాలకు కేంద్ర ప్రాయోజిత పథకాలు, విదేశీ ఆర్థిక సాయంతో చేపట్టే ప్రాజెక్టులకు 90:10 నిష్పత్తిలో గ్రాంట్లు పొందే అర్హత ఉంది. అందువలన ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల తరహాల్లోనే విదేశీ ఆర్థిక ప్రాజెక్టుల్లో ఏపీకి 90:10 నిష్పత్తిలో ప్రత్యేక ఆర్థిక సాయం చేయాలి. ఇప్పటికే అమల్లో ఉన్న 2019-20 వరకూ సంతకం అన్ని ప్రాజెక్టులకు దీన్ని వర్తింపచేయాలి. కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్రకటన నేపథ్యంలో వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన ఈఏపీ ప్రతిపాదనలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆర్థిక వ్యవహారాల విభాగానికి పంపింది. ఈఏపీ కింద చేపట్టే ప్రాజెక్టులు మొదలు కావడానికి, పూర్తికావడానికి చాలా సమయం తీసుకుంటాయి. వీటికి విదేశీ ఆర్థిక సంస్థ నుంచి అనుమతులు పొందడానికి సుదీర్ఘ నిబంధనల  ప్రక్రియ పూర్తిచేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియకు ఆర్థిక సాయాన్ని 2020లోపు పూర్తిగా ఖర్చుచేసే సామర్థ్యం ఆంధ్రప్రదేశ్‌కు లేదు'' అని ముఖ్యమంత్రి తన లేఖలో వివరించారు. అందువల్ల పేర్కొన్న ప్రత్యేక ఆర్థికసాయాన్ని విదేశీ ఆర్థిక సంస్థకు బదులుగా నాబార్డు నుంచి ఇప్పించాలని విజ్ఞప్తిచేశారు. నాబార్డు ద్వారా ఏయే ప్రాజెక్టుకు నిధులు కావాలో ఆ జాబితాలు కూడా ముఖ్యమంత్రి అరుణ్‌జైట్లీ దృష్టికి తీసుకెళ్లారు. ఆ మొత్తాన్ని గ్రాంటు రూపంలో ఇవ్వాలని కోరారు. దీనివల్ల అది ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోకి రాదని, తద్వారా రాష్ట్ర ప్రభుత్వం త్వరగా ప్రాజెక్టు పనులు మొదలుపెట్టడానికి వీలుంటుందని జైట్లీకి సీఎం తెలిపారు. పార్లమెంట్‌లో విభజన బిల్లు ఆమోదింపజేసే విషయంలో చెప్పినట్లుగా ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితిని కొంతమేర ఆదుకోవడానికి ఇది దోహదపడుతుంది' సీఎం తన లేఖలో అభిప్రాయపడ్డారు.

Don't Miss