ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు రివ్యూ

07:47 - August 22, 2017

విజయవాడ : ఈ ఏడాది చివరి నాటికి 28 ప్రాజెక్టులు పూర్తి చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం వహిస్తే సహించేది లేదన్నారు. రాష్ట్రంలోని అన్ని జలాశయాల వద్ద 'జలసిరికి హారతి' పేరుతో కార్యక్రమం నిర్వహించడానికి ప్రభత్వం రెడీ అవుతోంది.
పనుల్లో జాప్యం జరగొద్దు : సీఎం
నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు రివ్యూ నిర్వహించారు. పనుల్లో జాప్యం జరగొద్దని అధికారులకు సూచించారు. ఈనెలలో చేపట్టనున్న జలహారతి కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని జలాశయాల వద్ద హారతి ఇవ్వడానికి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రకృతితో ప్రతి ఒక్కరూ మమేకం కావాలన్నదే తమ ఆకాంక్షని సీఎం  చెప్పారు. అందుకే ఏరువాక, వనం-మనం, తాజాగా 'జలసిరికి హారతి' వంటి కార్యక్రమాలు చేపడుతున్నామని  చంద్రబాబు తెలిపారు.  'జలసిరికి హారతి' కార్యక్రమం జరిగినన్ని రోజులు ఆయా ప్రాంతాల్లో సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేసి పర్యాటకులను ఆకట్టుకోవాలని అన్నారు.  మైనర్ ఇరిగేషన్ సహా పూర్తయిన ప్రాజెక్టులన్నింటినీ ఈ సమయంలోనే ప్రారంభించాలని అధికారులకు సూచించారు. 
పోలవరంపై నెలనెలా నివేదిక ఇవ్వాలన్న సీఎం 
పోలవరం సహా  నిర్మాణంలో ఉన్న 28 ప్రాజెక్టుల పురోగతిపై ముఖ్యమంత్రి   సమీక్ష నిర్వహించారు. గడిచిన వారంలో వివిధ ప్రాజెక్టుల్లో జరిగిన పనుల వివరాలను సమీక్షించారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి, నిధుల వినియోగం, క్షేత్ర స్థాయిలో ఎదురయ్యే ఇబ్బందులు వంటి వాటికి సంబంధించిన వివరాలతో నెలనెలా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఎగువ రాష్ట్రాలు పెద్దసంఖ్యలో ప్రాజెక్టులు నిర్మించుకోవడంతో దిగువకు నీరు రావడం గగనమవుతోందన్న చంద్రబాబు ..అందుబాటులో ఉన్న నీటివనరులను సమర్థంగా వినియోగించుకోవాల్సి ఉందన్నారు.  
ఈ ఏడాది చివరికి 28 ప్రాజెక్టులు కంప్లీట్‌ 
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించకున్న లక్ష్యం మేరకు 28 ప్రాజెక్టులను ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేయాలని చెప్పారు. ప్రాజెక్టుల పనులపై వివిధ జిల్లాల ఛీఫ్ ఇంజనీర్లతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల , వంశధార  స్టేజి 2  పనులు వచ్చే ఏడాది జనవరి 5 నాటికి పూర్తికావాలని సీఎం డెడ్‌లైన్ విధించారు. అటు పోగొండ రిజర్వాయర్,  ఎర్రకాలువ ఆధునీకరణ పనులు మరో రెండు నెలల్లో పూర్తిఅవుతాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు.  పెదపాలెం, కండలేరు ఎత్తిపోతల పథకం  గోరుకల్లు రిజర్వాయర్, అవుకు టన్నెల్ పనులు దాదాపు పూర్తి కావొచ్చాయని అధికారులు వివరించారు.  అటు ఎగువ రాష్ట్రాలు నీటి విడుదల విషయంలో సరిగా వ్యవహరించడం లేదని, త్రిసభ్య కమిటీని అడ్డుపెట్టుకుని  నీటివిడుదలను అడ్డుకుంటున్నాయని మంత్రి దేవినేని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై  ఇప్పటికే కేంద్ర జలవనరుల శాఖతో మాట్లాడామని అవసరమైతే న్యాయపోరాటం చేయాలని సమీక్షలో చర్చించామని  మంత్రి దేవినేని తెలిపారు. మొత్తానికి రాష్ట్రంలోని ప్రాజెక్టుల నిర్మాణం తీరుతెన్నులు ఎప్పటికపుడు ప్రజలకు చెప్పాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. దీన్లో భాగంగానే ఈనెలాఖరు నుంచి జలహారతి కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు అధికారులు అంటున్నారు. ప్రభుత్వం చేపట్టే జలహారతి మరో ప్రచార కార్యక్రమం మాత్రమే అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. 

Don't Miss