ఇన్నోప్రోమ్‌-2016 సదస్సులో పాల్గొననున్న సీఎం బాబు..

06:23 - July 11, 2016

రష్యా : రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టడమేలక్ష్యంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రష్యాలో పర్యటిస్తున్నారు. రష్యాలో జరిగే ఇన్నోప్రోమ్‌ పారిశ్రామిక వాణిజ్య ప్రదర్శనలో పొల్గొంటారు. చంద్రబాబు రెండు రోజులు కజకిస్థాన్‌ పర్యటనలో ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి ఆ దేశ సహకారం కోరారు. ఇందుకు కజకిస్థాన్‌ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. రష్యాలోని ఎరిక్టన్‌బర్గ్‌లో జరుగుతున్న ఇన్నోప్రోమ్‌-2016 పారిశ్రామిక, వాణిజ్య ప్రదర్శనలో చంద్రబాబు పాల్గొంటారు. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి వసుంధర రాజే, మహారాష్ట్ర ముఖ్యమత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ ఈ ప్రదర్శనకు మనదేశం తరపున హాజరవుతున్నారు. జార్ఖండ్‌, గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ మంత్రులు కూడా పాల్గొంటున్నారు. ఇన్నోప్రోమ్‌ ప్రపచంలో అతిపెద్ద పారిశ్రామిక ప్రదర్శన కావడంతో ప్రపంచ దేశాలకు చెందిన పారిశ్రామిక సంస్థలు, కార్పొరేట్లు హాజరవుతున్నారు. నాలుగు రోజులపాటు జరిగే ఈ ప్రదర్శనలో మనదేశానికి చెందిన 110 కంపెనీలు పాల్గొంటున్నాయి. భారత్‌ తరుపున ఇన్నోప్రోమ్‌ పారిశ్రామిక ప్రదర్శనకు హాజరవుతున్న సీఎంలు, మంత్రులు తమ తమ రాష్ట్రాలకు పెట్టుబడులు సాధన కోసం వివిధ దేశాల పారిశ్రామికవేత్తలతో చర్చలు జరుపుతారు.

అమరావతి నిర్మాణంపై ఏపీ, అస్తానా వచ్చే నెలలో ఒప్పందం..
రెండు రోజుల పాటు కజకిస్థాన్‌లో పర్యటించిన చంద్రబాబు బృందం... ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి ఆ దేశ సహకారం కోరింది. కజకిస్థాన్‌లోని అస్తానా, ఆంధ్రప్రదేశ్‌ మధ్య పరస్పర సహకారానికి కార్యాచరణ బృందం ఏర్పాటుకు అంగీకారం కుదిరింది. అస్తానా మేయర్‌ అస్సెట్‌ లెస్కెష్కోవ్‌తో భేటీ అయిన చంద్రబాబు... పలు అంశాలపై చర్చించారు. అమరావతి నిర్మాణానికి ఉభయులు వచ్చే నెలలో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవాలని నిర్ణయించారు. ఏపీ వర్కింగ్‌ గ్రూపుకు మున్సిపల్‌ మంత్రి నారాయణ ప్రాతినిధ్యం వహిస్తారు. వర్కింగ్‌ గ్రూపులో తమ ప్రతినిధులను రెండు రోజుల్లో ప్రకటిస్తామని అస్తానా మేయర్‌ చెప్పారు. వచ్చే ఏడాది అస్తానా జరిగే పారిశ్రామిక ప్రదర్శనకు హాజరుకావాలని అస్సెట్‌ లెస్కెష్కోవ్‌ కోరగా... చంద్రబాబు అంగీకరించారు. అస్తానా నుంచి నేరుగా అమరావతికి విమాన సర్వీసులు నడిపే అంశంపై కూడా ఇద్దరు నేతలు చర్చించారు. భారత్‌ రాజకీయాల్లో చంద్రబాబు క్రియాశీలక పాత్ర, ఐటీ, సాంకేతిక రంగాల అభివృద్ధికి చూపిన చొరవను అస్తానా మేయర్‌ ప్రశంసించారు.

Don't Miss