పవన్ టూర్ తరువాత బాబు టూర్...

06:14 - June 5, 2018

విజయనగరం : వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకునే పార్టీలను చిత్తు చిత్తుగా ఓడించాలని.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. ఎన్నికలు రాని సమయం చూసి.. వైఎస్సార్సీపీ రాజీనామా డ్రామాలు ఆడుతోందని.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు. విపక్ష వైసీపీ నేతలకు ధైర్యముంటే.. మోదీపైన, బీజేపీపైనా పోరాడాలని సవాల్‌ విసిరారు. మోదీ ప్రభుత్వం ఏపీపై కుట్ర చేస్తోందని చంద్రబాబు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. సోమవారం విజయనగరం జిల్లాలో పర్యటించారు. శృంగవరపు కోటలో చేపట్టిన నవనిర్మాణ దీక్షలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని, అయితే.. నాలుగేళ్లు సహనంతో వేచి చూసినా.. రాష్ట్రానికి న్యాయం జరగక పోవడం వల్లే.. ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చినట్లు.. చంద్రబాబు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని, దానితో పొత్తుపెట్టుకునే పార్టీలను చిత్తుచిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంపై మోదీ కుట్రలు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఇందులో భాగంగానే వైసీపీ నేతలు, పవన్‌ కల్యాణ్‌ తనపై ఆరోపణలు చేస్తున్నారని, రాష్ట్రాన్ని బలహీన పరిచేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. టీటీడీని కూడా అపవిత్రం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజీనామా డ్రామాలు ఆడుతోందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఆపార్టీ నేతలకు ధైర్యముంటే.. మోదీపైన, బీజేపీపైన పోరాడాలని సవాల్‌ విసిరారు. ఆర్‌బీఐ ఒప్పుకోకున్నా రుణమాఫీ అమలు చేశామని, మహిళా సంఘాల రుణాలు రద్దు చేశౄమని, సాగునీటి పథకాలకు ప్రాధాన్యతనిచ్చామని చంద్రబాబు చెప్పారు. వ్యవసాయంలో ఖర్చులు తగ్గించేందుకు శ్రీకారం చుట్టామని, పంటకు గిట్టుబాటు ధర ఇచ్చే బాధ్యతను తీసుకున్నామని చెప్పారు. విజయనగరం జిల్లా పర్యటనలో భాగంగా.. ముఖ్యమంత్రి జమ్మాదేవిపేట వీధుల్లో పర్యటించారు. అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడే రచ్చబండ కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. చిన్న చిన్న పనులన్నీ పూర్తి చేసి... గ్రామ ప్రజల ఆదాయం పెంచడానికి కృషి చేస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. ప్రతి కుటుంబానికి నె లకు రూ. 10వేలు ఆదాయం రావాలన్నదే తన ఆశయమని అన్నారు. అనంతరం ఎస్‌.కోట గ్రామస్థులతోనూ చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు.

Don't Miss