తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు

21:49 - October 16, 2017

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతునే ఉన్నాయి. ఈరోజూ ఏపీలో ఓ ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ప్రైవేటు కాలేజీల్లో విద్యార్థుల మరణాలకు యాజమాన్యాలు అనుసరిస్తున్న విధానాలే కారణమని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. వీరిని నియంత్రించకుండా చేష్టలుడిగిన ప్రభుత్వ తీరుకు నిరసనగా.. రాష్ట్రాల్లో ఈరోజు ప్రైవేటు విద్యాసంస్థలను బంద్‌ చేయించాయి. ఒత్తిడి పెరుగుతుండడంతో.. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టాయి. 
వరుస ఆత్మహత్యలు తీవ్ర ఆందోళన
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు తీవ్ర ఆందోళనను కలిగిస్తున్నాయి. కన్నవారికి తీరని కడుపుకోతను మిగులుస్తున్నాయి. ప్రైవేట్‌ కాలేజీల్లో.. ఎక్కడో ఓ చోట ప్రతిరోజూ విద్యార్థుల సూసైడ్స్‌ జరుగుతూనే ఉన్నాయి. ర్యాంకుల వేటలో బలవంతపు చదువులు రుద్దడమే దీనికి కారణమన్న భావన వ్యక్తమవుతోంది. ప్రైవేటు యాజమాన్యాల తీరుకు.. వారిని నియంత్రించలేని ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ.. విద్యార్థి సంఘాలు.. సోమవారం, తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేటు విద్యాసంస్థలను బంద్‌ చేయించాయి. స్వేచ్ఛావాతవరణంలో చదువులు సాగేలా.. కార్పొరేట్‌ కాలేజీలను ఆదేశించాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. 
విద్యాసంస్థల బంద్ ప్రశాంతం 
విద్యార్థుల ఆత్మహత్యలను నిరసిస్తూ విద్యార్థి సంఘాల నేతలు తలపెట్టిన విద్యాసంస్థల బంద్ విజయవాడలో ప్రశాంతంగా కొనసాగింది. కృష్ణాజిల్లాలో 10 రోజుల్లో 7 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడంపై విద్యార్ధి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మంత్రులు  నారాయణ, గంటా శ్రీనివాసరావులను తక్షణమే బర్తరఫ్‌ చేయాలని, ఆత్మహత్యలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణలోనూ విద్యార్థి సంఘాలు ప్రైవేటు, కార్పొరేట్‌ కాలేజీల బంద్‌ పాటించాయి. అటు విశాఖలోనూ విద్యార్థి సంఘాలు కదం తొక్కాయి. జనసేన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ధర్నాకు దిగాయి. విద్యార్థులు పెద్ద సంఖ్యలో చనిపోతున్నా... సర్కార్‌ స్పందించడం లేదని విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రి గంటా తన వియ్యంకుడి కాలేజీలపై చర్యలు తీసుకునేందుకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. 
ఇరు రాష్ట్రాల ప్రభుత్వాల్లో కదలిక
విద్యార్థి సంఘాల ఆందోళనతో ఇరు రాష్ట్రాల ప్రభుత్వాల్లో కదలికవచ్చింది. అమరావతిలో విద్యాశాఖ అధికారులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ప్రైవేటు కాలేజీలు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కాలేజీల్లో విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఇందులో భాగంగా, 10వ తరగతి, సీబీఎస్‌ఈలో ఉన్న గ్రేడింగ్‌ విధానాన్ని ఇంటర్‌లోనూ ఈ ఏడాది నుంచే ప్రవేశపెట్టాలని  నిర్ణయించారు. వీటితో పాటు..విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు అధికారులు, ప్రైవేటు కాలేజీ అసోసియేషన్‌ సభ్యులు విద్యార్థి సంఘాల నాయకులతో కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 2012 నుంచి ఇప్పటివరకు 35 మంది విద్యార్థులు చనిపోయినట్లు ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. ఈ ఆత్మహత్యలు కూడా అత్యధికంగా నారాయణ, చైతన్య కాలేజీల్లోనే జరిగాయన్న వాస్తవాన్నీ ప్రభుత్వం అంగీకరించింది. 

 

Don't Miss